28-03-2025 12:01:03 AM
బ్యాంకింగ్ రంగంలో ఏడు కీలక మార్పులు..
ఆ నంబర్లకు యూపీఐ సేవలు బంద్..
మినిమం బ్యాలెన్స్ లేకపోతే చార్జీల బాదుడే..
క్రెడిట్, డెబిట్ కార్డు రివార్డుల్లోనూ కోతలు..
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. నేరాలను అరికట్టడానికి బ్యాంకింగ్ సేవలను మెరుగుపరుస్తూ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి.ముఖ్యంగా ఏడు విభాగాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అవేంటనేది ఒకసారి పరిశీలిద్దాం..
1) ఏటీఎం లావాదేవీల విషయంలో కీలక మార్పులు రాబోతున్నాయి. వినియోగదారులకు అందించే మొత్తం ఉచిత లావాదేవీలు, వాటి గరిష్ఠ పరిమితులు, లిమిట్ దాటి చేసే లావాదేవీలపై చార్జీల్లో మార్పులు రానున్నాయి. ఉచిత లావాదేవీల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉండగా.. లిమిట్ దాటిన తర్వాత చేసే ప్రతీ లావాదేవీకి రూ. 20 నుంచి 25 వరకు చార్జీ ఉండనుంది.
2) యూపీఏ వినియోగదారులు ఎక్కువ కాలం నుంచి ఉపయోగించని ఐడీలు ఏప్రిల్ 1 నుంచి డీయాక్టివేట్ కానున్నాయి. సదరు మొబైల్ నంబర్లను బ్యాంక్ రికార్డుల నుంచి తొలగించనున్నారు.
3) బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే ఇకపై చార్జీల బాదుడు ఉండనుంది. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ పరిమితి పెంచడంతో పాటు దానిని మెయింటేన్ చేయకపోతే ఎక్కువ చార్జీ వేయనున్నారు.
4) బ్యాంకింగ్ మోసాలను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) అమలు చేసింది. ఇకపై 50వేల కంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసే కస్టమర్లు, పీపీఎస్ వారు లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల గురించి అన్ని వివరాలను బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది.
5) దేశంలో వివిధ బ్యాంకులు తమ వడ్డీ రేట్ల మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయి. రిజర్వ్ బ్యాంకు రెపో రేటుకు అనుగుణంగా డిపాజిట్లతో పాటు కొత్తగా అందించే రుణాలపై రేట్ల మార్పులను ప్రకటించే అవకాశముంది.
6) బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో కీలక మార్పులు తీసుకురానున్నాయి. క్రెడిట్ కార్డులపై రివార్డుల్లో ఎస్‌బీఐ కోత పెట్టింది. స్విగ్గీ, ఎయిరిండియా, టికెట్ బుకింగ్‌లపై లభించే రివార్డులను తగ్గించింది. ఎస్‌బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ ప్లాటినం కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డు , యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డుల్లో కోత పడనుంది.
7) బ్యాంకులు కొత్తగా అందుబాటులోకి తెస్తున్న ఏఐ చాట్ బాట్స్ ఖాతాదారులకు అనేక వివరాలను తక్కువ సమయంఓల అందించేలా మార్పులు చేయనున్నాయి. సురక్షిత లావాదేవీలు జరిపేందుకు 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ సేవలు మరింత బలోపేతం కానున్నాయి.