calender_icon.png 19 April, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ వివాదాల పరిష్కారానికే నూతన ఆర్‌ఓఆర్ చట్టం

18-04-2025 12:01:27 AM

గద్వాల, ఏప్రిల్ 17 ( విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూవివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. గురువారం గద్వాల్ మార్కెట్ యార్డ్ లోని భూ భారతి చట్టం-2025 పై అవగాహన సదస్సు లో జిల్లా కలెక్టర్ పాల్గొని,భూభారతి చట్టంపై, అందులోని అంశాలపై వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. ధరణి స్థానంలో కొత్తగా  భూ భారతి వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు.భూ భారతి చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలున్నాయని తెలిపారు. గతంలో ధరణిలో  మన జిల్లా టాప్ 10 స్థానంలో ఉందని తెలిపారు.

ఆధార్ తరహాలో భవిష్యత్లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ’భూధార్’ తీసుకురాబోతుందని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడినదని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సాదా బైనామాల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతం కావడంతో పాటు, వారసత్వ భూముల మ్యూటేషన్ను గడువులో పూర్తిచేయడం, హక్కుల సంక్రమణను అధికారికంగా నమోదు చేయడం ద్వారా వ్యవస్థ మరింత నిబద్ధతతో పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీవో శ్రీనివాస రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, పి.ఎ.సి.ఎస్  చైర్మన్ సుభాన్ గద్వాల్ తహసీల్దార్ మల్లికార్జున్, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, రైతులుపాల్గొన్నారు.