calender_icon.png 23 January, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లో సరికొత్త రికార్డులు

19-07-2024 12:05:00 AM

  • తొలిసారిగా 81,000 దాటిన సెన్సెక్స్ 
  • నిఫ్టీ @ 24,800

ముంబై, జూలై 18: ఒక రోజు సెలవు అనంతరం మార్కెట్లో బుల్స్ దూకుడు ప్రదర్శించారు. తాజాగా కొత్త రికార్డుల సృష్టి జరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా గురువారం 81,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది.  ట్రేడింగ్ తొలిదశలో  ఈ సూచి 500 పాయింట్ల మేర కోల్పోయి  80,390 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయినప్పటికీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో మార్కెట్ ముగింపు సెషన్‌లో అవలీలగా 81,000 పాయింట్లను దాటేసి, 81,522 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు  627 పాయింట్ల లాభంతో 81,343 పాయింట్ల రికార్డు గరిష్ఠం వద్ద ముగిసింది.

ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలి నష్టాల్ని అధిగమించి తొలిసారిగా 24,800 పాయింట్ల స్థాయిపై పాగా వేసింది. ఒకదశలో 224 పాయింట్లు పెరిగి 24,837 పాయింట్ల వద్ద నూతన రికార్డును నెలకొల్పింది. చివరకు 188 పాయిం ట్ల లాభంతో  కొత్త గరిష్ఠస్థాయి 24,801  పాయింట్ల  వద్ద ముగిసింది.   ఐటీ షేర్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలతో పాటు హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో జరిగిన కొనుగోళ్లు సూచీలను కొత్త రికార్డుస్థాయిలకు చేర్చినట్టు ట్రేడర్లు తెలిపారు.

జూన్ త్రైమాసిక ంలో ప్రధాన ఐటీ కంపెనీలు మంచి ఆర్థిక పనితీరును ప్రదర్శించడంతో ఈ రంగంపట్ల ఇన్వెస్టర్ల విశ్వాసం పెంపొందిందని, రూపాయి బలహీనత సైతం ఐటీ షేర్లకు మద్దతు లభించడానికి మరో కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. యూఎస్ ఫెడ్ సెప్టెంబర్‌కలా వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు బలపడటం తో అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గుదలతో విదే శీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నందున  మార్కెట్లో కొత్త రికార్డులు నెలకొంటున్నాయని విశ్లేషకులు తెలిపారు.

టాప్‌లో టీసీఎస్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేరు అత్య ధికంగా 3.33 శాతం పెరిగి ఏడాది గరిష్ఠస్థాయి రూ.4,315 వద్ద ముగిసింది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 1.93 శాతం ఎగిసి ఏడాది గరిష్ఠం రూ.1,758 వద్ద నిలిచింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫీ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించింది. బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1.8 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. 

చిన్న షేర్లు నేలచూపులు

పలు దిగ్గజ కంపెనీల ర్యాలీతో ప్రధాన స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పెరిగినప్పటికీ, చిన్న షేర్లు మాత్రం నేలచూపులు చూశాయి. దీనితో బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.15 శాతం పడిపోయింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.99 శాతం క్షీణించింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్ల అధిక విలువలు, రంగాలవారీగా ఇన్వెస్టర్లు జరుపుతున్న రొటేషన్ కారణంగా మార్కెట్లో అధికభాగం ర్యాలీలో వెనుకబడినట్టు నాయర్ చెప్పారు. వివిధ రంగాల సూచీల్లో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.03 శాతం తగ్గింది. ఇండస్ట్రియల్స్ సూచి 1.95 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 1.08 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.87 శాతం చొప్పున తగ్గాయి.  ఐటీ, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ సూచీలు లాభపడ్డాయి.