హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదటిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. ప్రజా ప్రభుత్వం కొత్త కార్డుల్లోని 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేయనుంది. తొలిరోజు మండలానికొక గ్రామంలో కొత్త రేషన్ కార్డుల జారీ రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లు చేరించినట్లు తెలిపింది. 516 గ్రామల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించారు. మొదటి రోజు 20,336 మంది భూమిలేని కూలీలకు నిధులు విడుదల చేశారు.
తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రజా ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కొనసాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తొలివిడతలో మండలానికొక గ్రామంలో రైతుభరోసా సొమ్ము విడుదల చేసి, ఇవాళ 4,41,911 రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 577 మండలల్లో 9,48,333 ఎకరాలకు రూ.563 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇక నుంచి ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు నుంచి రూ.12 వేలకు పెంచిన ఆర్థిక సహయం రైతుల ఖాతాల్లో జమ అవుతూందని మంత్రి తుమ్మల తెలిపారు. దీంతో రైతుభరోసా సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.