calender_icon.png 22 December, 2024 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు!

22-12-2024 02:26:47 AM

  1. ఆరున్నరేళ్ల తర్వాత మోక్షం
  2. చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డు
  3. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ ప్రకటన 
  4. రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి
  5. డిసెంబర్ 31 వరకే తుది గడువు

మెదక్, డిసెంబర్ 2౧ (విజయక్రాంతి): కొత్త సంవత్సరం సంక్రాంతి పండగకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించగా.. దరఖాస్తుదారుల ఆరున్నరేళ్ల నిరీక్షణకు మోక్షం లభించనుంది.

గతంలో వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సూచనలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సలహాల మేరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని మంత్రి ప్రకటించగా.. కలెక్టర్లకు ఆదేశాలు రావాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలు తెల్ల రేషన్ కార్డుతో అనుసంధానమై ఉన్నాయి.

ఆరున్నరేళ్లుగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడం, ఉన్నా పిల్లల పేర్లు నమోదు చేసే అవకాశం లేక అనేక కుటుంబాలు వీటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాలు ఉండగా అంత్యోదయ కార్డులు 13,871, ఆహార భద్రత కార్డులు 1,99,917, అన్నపూర్ణ కార్డులు 62 ఉన్నాయి.

బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో 2019, జూన్ 30న తెల్లరేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిపివేయగా, 2020లో రాష్ట్రవ్యాప్తంగా కొంత మందికి ఇచ్చినట్టే ఇచ్చి ఫ్రీజింగ్ విధించింది. దీంతో నాటి నుంచి నేటి వరకు కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు, ఉమ్మడి కుటుంబం నుంచి విడిగా ఉన్న వారు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా వీరిలో అప్పటికే తెల్లరేషన్ కార్డులు ఉన్నప్పటికీ పిల్లలు పుట్టిన తర్వాత వారి పేర్లను చేర్చడం, ఆధార్, అడ్రస్, ఫోన్ నంబర్లు సరి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 

20 వేలకుపైగా అర్జీలు

జిల్లావ్యాప్తంగా మ్యుటేషన్ నంబర్ అడిషన్, కొత్త కార్డుల కోసం సుమారు 20 వేలకు పైగా దరఖాస్తులు రాగా ఇందులో కొత్త కార్డులు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులను చేర్చాలని కోరినవి ఉన్నాయి. 2017 నుంచి ప్రస్తుతం వరకు కొత్తగా తెల్లరేషన్ కార్డుల కోసం సుమారుగా 10 వేల పైగా దరఖాస్తులు వచ్చాయి.

క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సలహాలు, సూచనల మేరకు కొత్త అప్లికేషన్లకు ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి నియమ నిబంధనలు విడుదల కాగానే తిరిగి దరఖాస్తుల స్వీకరణకు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇలావుండగా కొత్త కార్డులతో పాటు సన్నరకం బియ్యం ఇస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

జాప్యానికి అనేక కారణాలు..

ఆధార్ నవీకరించకపోవడం, బయోమెట్రిక్ ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం వల్ల ఈ కేవైసీలో జాప్యమవుతుంది. గత పదేళ్లలో చాలా మంది చనిపో యారు. వారి వివరాలు అప్‌డేట్ చేయలేదు. యువతులు వివాహాలు చేసుకుని వెళ్లిపోయారు. వివాహం చేసుకొని కొత్త కాపురా లు ఏర్పాటు చేసుకున్న వారి పేర్లు తొలగించినా, కొత్త కార్డులు మంజూరు కాలేదు. 

ఈనెల 31 వరకు టైమ్

ఆహార భద్రత కార్డు ఈ-కేవైసీ చేయించుకోవడానికి ఈనెల 31న చివరి గడువు విధించారు. అయితే ఈ విషయంలో ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాల్లో ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకే రేషన్ అం దేలా చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబం లో లబ్ధిదారుల్లో ఎవరైనా ఈ-కేవైసీ చేయించుకోకుంటే వారి పేర్లను కార్డు నుంచి తొలగించనున్నారు. గడువులోగా పేర్లు సరిగా లేకపోతే పథకాల లబ్ధికి ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెబుతున్నారు. 

తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి

ప్రతిఒక్కరూ తమ రేషన్ డీలర్లను సంప్రదించి వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆధార్‌కు సంబంధించి సమస్యలుంటే ముందే పరిష్క రించుకోవాలి. ఇదివరకే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

 బ్రహ్మారావు,

జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి