calender_icon.png 28 October, 2024 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో కొత్త రేషన్‌కార్డులు

08-07-2024 02:30:00 AM

  1. దసరా తరువాత పంపిణీకి సన్నాహాలు
  2. 10 లక్షలకుపైగా కొత్త దరఖాస్తులు  
  3. కార్డులో సభ్యుల పేర్ల నమోదు, తొలగింపునకు అవకాశం

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులకు త్వరలో మోక్షం లభించనుంది. గత బీఆర్‌ఎస్ సర్కార్ కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకపోవడంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పేదలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధి పొందేందుకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్న క్రమంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కార్డుల జారీపై స్థానిక ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన రేషన్‌కార్డుల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేయడంతో కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్‌లో ప్రభుత్వం వారం రోజుల పాటు ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి రేషన్‌కార్డులకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంది. వీటిని ఫిబ్రవరిలో స్థానిక అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులు పంపారు. తరువాత పార్లమెంటు ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ప్రభుత్వం కొత్తకార్డుల జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. పాతవాటి స్థానంలో కొత్త డిజిటల్ కార్డులు అందించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల కార్డులుం డగా మరో 10 లక్షల కుటుంబాల నుంచి కొత్తగా దరఖాస్తులు వచ్చినట్లు పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. కొత్తకార్డుల మంజూరుపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని తెలుస్తోంది. దసరా వరకు అర్హులకు కచ్చితంగా అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే సూచనప్రాయంగా ఆదేశాలు వచ్చినట్లు రాష్ట్ర పౌరసరఫరాల ఉన్నతాధికారులు వెల్లడించారు. 

పేర్ల నమోదుకు అవకాశం 

రేషన్‌కార్డులకు సంబంధించిన మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సోమవారం నుంచి అర్హులైన వారు తమ పేర్లు ఈ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవాలని పేర్కొంది. రేషన్‌కార్డుల్లో తప్పులు సరిచే యడానికి, కొత్తగా పిల్లల పేర్లు నమోదు చేయడానికి, వివాహమైన వారికి అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేషన్‌కార్డులో సవరణలు చేయడానికి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జిరాక్స్ తీసుకుని ఈసేవా కేంద్రానికి వెళ్లాలి. రేషన్‌కార్డుపై ఒక పేరు, ఆధార్‌లో మరో పేరు ఉన్న వారు సైతం మార్పులు చేసుకునే వీలు కల్పించింది.