04-03-2025 01:11:48 AM
మేడ్చల్, మార్చి 3(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా ఏసిపి కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు ఏసిపి కార్యాలయాలు, నాలుగు కొత్త పోలీస్ స్టేషన్ లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కనీసం రెండు పోలీస్ స్టేషన్ లు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఆయా ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇది వరకు మల్కాజిగిరి ఎసిపి కార్యాలయం ఉండగా, కొత్తగా మేడిపల్లి లేదా ఘట్కేసర్, కుసాయిగూడ లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. కొత్తగా బోడుప్పల్, దమ్మా యిగూడ, రామంతపూర్, మౌలాలి పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కానున్నాయి.
మేడిపల్లి లేదా ఘట్కేసర్ ఏసిపి పరిధిలో మేడిపల్లి, బోడుప్పల్, పోచారం, ఘట్కేసర్, షామీర్పేట్, దమ్మాయిగూడ, జవహర్ నగర్, కీసర పోలీస్ స్టేషన్ లు, కుషాయిగూడ ఏసీపీ పరిధిలో కుషాయిగూడ, నేరేడ్మెట్, చర్లపల్లి పోలీస్ స్టేషన్‌లు, మల్కా జిగిరి ఏసీపీ పరిధిలో మల్కాజిగిరి, మౌలా లి, నాచారం, ఉప్పల్, ఉప్పల్ మహిళా స్టేషన్, రామంతాపూర్ పోలీస్ స్టేషన్ లతో ప్రతిపాదనలు పంపారు. మేడ్చల్‌లో రూరల్ పోలీస్ స్టేషన్
కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న మేడ్చల్ రూరల్ పోలీస్ స్టేషన్ కు మోక్షం లభించనుంది. మేడ్చల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. కొంపల్లిలో కూడా కొత్తగా పోలీస్ స్టేషన్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కొంపల్లి స్టేషన్ పరిధిలోకి రానుంది.
అస్తవ్యస్తంగా పోలీస్ లిమిట్స్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే మేడ్చల్ జిల్లాలోని పోలీస్ లిమిట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈసారి కూడా అలాగే ప్రతిపాదనలు తయారు చేశారు. మేడ్చల్ కు షామీర్పేట్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని మేడ్చల్ లో కాకుండా గతంలో పేటు బషీరాబాద్ ఏసిపి పరిధిలో చేర్చారు. ప్రస్తుతం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే మేడిపల్లి పరిధిలో చేర్చుతూ ప్రతిపాదనలు పంపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి మార్చడం గమనార్హం. దూరంలో ఉన్న మేడిపల్లి ఏసిపి పరిధిలోకి మార్చడం పట్ల షామీర్పేట్ ప్రాంతంలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. గతంలో అన్యాయం చేశారని స్థానికులు అంటున్నారు. మేడ్చల్ ఏసిపి పరిధిలోకి చేర్చాలని వారు కోరుతున్నారు. జీ నోము వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధి కూడా పేట్ బషీరాబాద్ ఏసిపి పరిధిలో ఉంది. దీనిని కూడా మేడ్చల్ ఏ సి పి పరిధిలో చేర్చాలని స్థానికులు కోరుతున్నారు.