calender_icon.png 31 January, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయా ఉస్మానియా

31-01-2025 12:43:21 AM

  1. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా నూతన దవాఖాన
  2. నేడు భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి) : తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరోకొత్త శకం ప్రారంభం కానుంది. తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు వందేళ్లుగా సేవలందించిన ఉస్మాని  దవాఖానకు నూతన భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి అఫ్జల్‌గంజ్‌లో ఉండగా.. నూతన ఆస్పత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. నూతన ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు భూమిపూజ చేయనున్నారు. సుమారు 2వేల పడకల సామర్ధ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆస్పత్రిని నిర్మించనున్నారు.

26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఆస్పత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లుగా నూతన ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

దీంతో అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకేచోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన చేశారు.

అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్, ఆస్పత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆస్పత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆస్పత్రి ప్రాంగంణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆస్పత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆస్పత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చేవారు సేద తీరేందుకు డార్మెంటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు తదితర వాటిని నిర్మించనున్నారు.