calender_icon.png 18 November, 2024 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరగాళ్ల కొత్త వలలు

28-07-2024 12:05:00 AM

‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నది సామెత. తెలంగాణలో లక్ష రూపాయలలోపు రుణమాఫీ ఈనెల 18 నుండి అమలులోకి వచ్చింది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు చాలామంది  రైతులకు మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని వాళ్ల మొబైల్ నంబర్‌కు సంక్షిప్త సందేశాలు(ఎస్‌ఎంఎస్‌లు), కొందరికి లింక్ పంపి వెయ్యి రూపాయలు కట్టమని చెప్తున్నారు. ఆంధ్రాలో సైబర్ నేరగాళ్లు అమ్మఒడి పథకం ఉపయోగిం చుకోలేని వారికి ఫోన్ చేసి ‘నేను అమరావతి నోడల్ అధికారిని. మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకోలేక పోయారు. ఇప్పుడు ‘తల్లికి వందనం’ పథకంలో పాత బకాయిలు వస్తాయి. మీరు మీ అకౌంట్ నెంబర్, పాన్ నంబర్ వివరాలు ఇస్తే మేము మీకు  ప్రొసీడింగ్స్ కాపీ పంపుతాం.

అందులో వివరాలు పొందు పరచి మేము తెలిపిన అకౌంట్ నంబర్ యాడ్ చేయండి. వెంటనే మీకు పాత బకాయిలు  వస్తాయి’ అంటూ మోసం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవడం అసాధ్యంగా మారింది. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొందరు వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీ డుస్తున్నారు. ప్రస్తుత సమాచార సాంకేతిక యుగంలో మనిషి జీవితం అనిశ్చితికి గురవుతున్నది. అంతర్జాలంలోని సామాజిక అనుసంధాన వేదిక పరిచయాల ఆధారంగా మోసాలకు పాల్పడే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ముఖ్యంగా మాయమాటలతో యువతులను మోసగించి, వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఉదంతాలు రోజూ వెలుగుచూస్తున్నాయి. ఈ విష సంస్కృతి అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. అయినా, అనేక ఘటనలు కేసులుగా నమోదు కావడం లేదు. 

పెరిగిన ఆర్థిక నేరాలు

సెల్ ఫోన్ల సంఖ్యతోపాటు వాటిద్వారా జరుగుతున్న సైబర్ నేరాల్లో ఆర్థిక నేరాలు 2024లో 47 శాతం  పెరిగినట్లు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. సెల్‌ఫోన్ల ఆధారంగా ఆర్థిక లావాదేవీలు పెరు గుతుండటంతో నేరాలూ అదే స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. ఇవేకాక ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ దాడుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఇంటర్నెట్ భద్రత విధానం-- రూపొందించి విడుదల చేసింది. తద్వారా సైబర్ భద్రత విధానం కలిగిన కొద్ది దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. దేశ ఇంటర్నెట్ అస్థిరతను ఆర్థిక అస్థిరతతో సమానంగా భావిస్తున్నట్లు పేర్కొంది.

ప్రభుత్వ-, ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షలమంది ఇంటర్నెట్ భద్రతా నిపుణులతో కూడిన సమర్థ సిబ్బంది వ్యవస్థను ఏర్పా టు చేయాలని సూచించింది. సాంకేతిక శిక్షణ, సామర్థ్య నిపుణులతో ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించింది. దేశంలోని వివిధ స్థాయిల్లో సైబర్ భద్రతకు వాటిల్లే ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని జాతీయ ఇంటర్నెట్ భద్రత విధానం సూచిస్తున్నది. సైబర్ భద్రతకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఒక జాతీయ నోడల్ ఏజెన్సీతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ యంత్రాంగాలు పనిచేయాల్సి ఉంటుంది.

అయితే, ప్రభు త్వం వీటిపై శ్రద్ధ చూపడం లేదు. సైబర్ నేరాలవల్ల వ్యక్తిగతంగా భారీ నష్టం జరుగుతున్నది. విలువైన పేటెంట్లు చోరీ చేయడం, ఆర్థిక సంస్థలను మోసం చేయ డం, బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసి నిధులు మళ్లించడం, క్రెడిట్, డెబిట్ కార్డులనుంచి చోరీ, ఇతర సైబర్ నేరాలవల్ల ప్రపంచ దేశాలు ఏటా 42,000 కోట్లనుంచి లక్షకోట్ల డాలర్ల వరకు నష్టపోతున్నట్లు అంచనా.

భద్రత స్థితి మరీ దారుణం

ఆర్థిక నేరాల సంగతి పక్కన పెడితే భద్రతా వ్యవస్థ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఉగ్రవాద చర్యలతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఆల్‌ఖైదా మూకలను తేలికపాటి మానవ రహిత విమానం ‘డ్రోన్’ బెంబేలెత్తించింది. యాభై వేల రూపాయలు వెచ్చిస్తే అదే విమానాన్ని హ్యాక్ చేసి తమ నియంత్రణలోకి తెచ్చుకుని పెను విధ్వంసానికి పాల్పడవచ్చని కొందరు సైబర్ నిపుణులు నిరూపించారు. స్ఫూఫింగ్ అనే ప్రక్రియద్వారా డ్రోన్‌ను అదుపులోకి తెచ్చుకోగలిగారు. ఇదంతా అమెరికా రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగ ప్రక్రియ.

అలాంటి సాంకేతిక పరిజ్ఞానం పొరపాటున సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే, వారే ఈ నైపుణ్యాన్ని సొంతం చేసుకోగలిగితే మొత్తం ప్రపంచ భద్రతే కుప్పకూలుతుంది. నింగిలో ఎగురుతున్న డ్రోన్‌ను తమ అదుపులోకి తీసుకురాగల పరిజ్ఞానం ఆవిష్కృతమైంది. భవిష్యత్తులో అసాంఘిక శక్తులు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రయాణికుల విమానాన్నో, దాన్ని నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కంప్యూటర్లలోకో చొరబడితే ఊహకందనంత నష్టం సంభవిస్తుంది. ఇలా జరగడానికి ఆస్కారం లేదని భరోసా ఇవ్వలేని పరిస్థితులు ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్నాయి.

ఖాళీ అవుతున్న ఖాతాలు

ఇటీవల ఎక్కువగా నమోదయ్యే నేరాలు అకౌంట్ టేకోవర్‌కు సంబంధించినవే. ఈ సైబర్ నేరగాళ్లు వ్యాపార లావాదేవీలు జరిపే వారి ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేస్తారు. అన్ సెక్యూర్డ్ ఈ--మెయిల్ ఐడీల లావాదేవీలను కొంతకాలం పరిశీలిస్తారు. అదును చూసుకుని నగదు చెల్లించాల్సిన వ్యక్తికి, నగదు తీసుకునే వ్యక్తిలా మెయిల్ పంపిస్తారు. బ్యాంక్ ఖాతా మారిందంటూ తమ ఖాతాను మెయిల్‌లో పొందుపరుస్తారు. దీంతో చెల్లింపులు సైబర్ నేరగాడి ఖాతాలోకి వస్తాయి. అందుకే, ఖాతాలు మారినట్టుగా సమాచారం వస్తే అవతలి వ్యక్తిని నేరుగా సంప్రదించి నిర్ధారించుకున్న తర్వాత డిపాజిట్ చేయడం ఉత్తమం. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల ఏదో ఒక సర్వే చేస్తున్నామని నమ్మబలుకుతుంటారు.

ఈ-మెయిల్ ఐడీ, సెల్‌ఫోన్ నంబరు రాసి డబ్బాలో వేస్తే డ్రా తీసి బహుమతి ఇస్తామని కూడా ఆశ పెడతారు. అలాంటి వారికి వివరాలిస్తే ఇబ్బందే. వారి దగ్గర నుంచి ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు కొనేసి తమ పని కానిస్తున్నారు. ‘మేం ఫలానా బ్యాంకునుంచి మెయిల్ చేస్తున్నాం. భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలు తనిఖీ చేస్తున్నాం. మీ అకౌంట్ నంబర్, పాస్‌వర్డ్ చెప్తే ఎవరూ టాంపర్ చేయకుండా చర్యలు తీసుకుంటాం’ అంటూ వచ్చే ఈ-మెయిల్‌కు స్పందిస్తే ఖాతా ఖాళీ అయినట్లే. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకు ఇలా కోటికి పైగా ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నట్లు అంచనా. ఇక ఎస్‌ఎంఎస్‌లో ఇలా వచ్చే సందేశాన్ని ‘స్మిషింగ్’ అంటారు. 

కంప్యూటర్ ద్వారా జరిపే ప్రతి లావాదేవీని తెలుసుకునేందుకు కీ లాగర్స్ అనే సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు. కంప్యూటర్‌ను వినియోగించిన వారు ఏ సమాచారం టైప్ చేశారో ఈ సాఫ్ట్‌వేర్‌తో తెలుసుకోవచ్చు. నెట్ కేఫ్‌లోని సిస్టమ్స్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనితో కంప్యూటర్‌ను వాడుకున్న వారు టైప్ చేసిన సమాచారాన్ని తస్కరించి దుర్వినియోగం చేసేవాళ్లు పెరిగారు. షాపు లేదా పెట్రోల్ బంక్‌కు వెళ్లి, క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించినపుడు కార్డు చెల్లింపు సమాచారానికి చెందిన ఒక కాపీ వారే ఉంచుకుంటారు. వారి దగ్గర ఉంచుకునే బిల్లు కాపీలో పేరు, కార్డు నంబర్ ఉంటాయి. కార్డు వెనుక ఉన్న సీవీవీ కోడ్‌ను అవతలి వ్యక్తులు నోట్ చేసుకుంటే నెట్‌లో మీ ఖాతాతో వారు షాపింగ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి స్కిమ్మర్లు వినియోగించి కార్డు డేటాను దొంగిలించి, మరో కార్డు తయారు చేసి జల్సా చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను పట్టుకోవడం దాదాపు అసాధ్యం. 

కాబట్టి, వీటిపై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలి. కళాశాలలు, కార్యాల యాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. సైబర్ నేరాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాయనడంలో సందేహం లేదు. వీటిపట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సైబర్ నేరాలను పసిగట్టి నిందితులను అరెస్టు చేయాలంటే నిఘా వ్యవస్థలను సాంకేతికంగా బలోపేతం చేయాల్సి ఉంది. దేశ రక్షణకు సంబంధించి ఎప్పటికప్పుడు సరికొత్త సైబర్ యుద్ధతంత్ర వ్యూహాలను రచించాలి. అప్పుడే దేశానికి, ప్రజలకు సంపూర్ణ భద్రత లభిస్తుంది. సైబర్ నేరాలను ఎదుర్కొనే విషయంలో అంతర్జాతీయ సమా జం ఏకతాటిపైకి రావాల్సిన అవసరమూ ఎంతైనా ఉంది.  

 డా॥ ముచ్చుకోట సురేష్ బాబు