- బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై తేల్చని అధిష్ఠానం
- ఓసీకా..? బీసీకా..? పార్టీలో తీవ్ర చర్చ
- ముఖ్యనేత చెప్పిన వారికే పదవి అంటూ ప్రచారం
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమవుతున్నకొద్దీ తెరపైకి కొత్త కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి. అదిగో ఇదిగో అంటూ వస్తున్న పార్టీ అధిష్ఠానం త్వరలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షున్ని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ సోమవారం జాబితా విడుదల చేశారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకమే మిగిలిందంటూ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈనెల 15వ తేదీ లోపు కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అధ్యక్షరేసులో వినిపిస్తూ వచ్చిన పేర్లకు అదనంగా మరికొన్ని పేర్లను కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, రాంచందర్ రావు, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, డీకే అరుణ పేర్లు చర్చకువచ్చాయి. వీరిలో ఎవరో ఒకరికి అవకాశం లభిస్తుందంటూ చర్చ జరిగింది. తర్వాత కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు కూడా వినిపించింది. అయితే తాను అధ్యక్ష రేసులో లేనంటూ ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే కొత్తగా జాతీయ నేత మురళీధర్‌రావు పేరు కూడా చర్చలోకి వచ్చింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయం సాధించడం అధిష్ఠానానికి కష్టంగా మారిందని చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో పాత, కొత్త అనే విభేదాలు కూడా తలెత్తుతున్నాయని అంటున్నారు.
దీనికి మధ్యేమార్గంగా ఓసీలకు అధ్యక్ష పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే చర్చ చేస్తున్నారని అంటున్నారు. అలా కాకుండా బీసీలకు అధ్యక్ష పదవి లభిస్తే మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఉండకపోవచ్చని సమాచారం. అయితే అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది త్వరలోనే తేలనుంది.
ఆయన ఎవరికి చెప్తే వారికే..
అయితే రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్యనేతకే బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్ర ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఆయన ఎవరికి చెప్తే వారికే అధ్యక్ష పదవి ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దక్షిణాదిలో పార్టీ పెరుగుదలకు పలువురు ప్రముఖులను పార్టీకి అటాచ్ చేయడం లో ఆయనే కీలకపాత్ర వహిస్తున్నారని ఈ నేపథ్యంలో ఆయన్ను కాదని అధిష్ఠా నం నిర్ణయం తీసుకోదని.. ఆయన ఎవరికి చెబితే వారికే అవకాశం వస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. రాష్ట్రానికి కాబోయే బీజేపీ కొత్త అధ్యక్షుడు అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.