calender_icon.png 24 December, 2024 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేపర్ లీక్‌లపై కొత్త చట్టం

23-06-2024 12:00:00 AM

వరస పేపర్ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్రప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 

(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024’ పేరిట పార్లమెంటు, రాష్ట్రపతి  ఇప్పటికే ఆమోదించిన ఈ చట్టం ఈ నెల 21నుంచి అమలులోకి వచ్చినట్లు పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ చట్టం చేసినా లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఈ విషయమై ప్రశ్నించగా, న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలోనే నోటిఫై చేస్తామని చెప్పారు. కేంద్రమంత్రి ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే  కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ ఈ చట్టాన్నిఅమలులోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.

ఈ చట్ట ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచిత సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ అడ్మిషన్ కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. అందుకు కారకులైన వారికి 5 నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు  జైలుశిక్ష లేదా, కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి వీలుంది. ఇందులో భాగస్వాములు గనుక వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులను కూడా జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును కూడా వీరినుంచి వసూలు చేస్తారు. ఇకపై అన్ని పేపర్ లీకేజి కేసులను ఈ చట్టం కింద నమోదు చేస్తారు. జాతీయ స్థాయిలో ఇలాంటి చట్టం తీసుకు రావడం ఇదే తొలిసారి.పాత నేర చట్టాల స్థానంలో  కొత్తగా తీసుకు వచ్చిన ‘న్యాయ సంహిత’ కిందికి రాని ఈ నేరాల కట్టడి కోసం గత ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకు వచ్చింది.

 వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పేపర్ వివాదం దేశమంతా కుదిపేస్తున్న తరుణంలోనే యూజీసీ  నెట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా ఆ పరీక్షను రద్దు చేసున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదే కాకుండా పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ.. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల్లో కూడా ప్రశ్న పత్రాలు లీకయినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. దీంతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యార్థులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు జరపుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని రద్దు చేసి మొత్తం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

లక్షలాది విద్యార్థుల భవితవ్యం ఈ పోటీ పరీక్షలపై ఆధారపడి ఉండడం, విద్యార్థుల ఆందోళనలకు ప్రతిపక్షాలు తోడవడంతో కే్ంరద్రానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కొత్త పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడంతో లోక్‌సభ ఎన్నికల్లో తమ బలాన్ని గణనీయంగా పెంచుకున్న ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హడావుడిగా యాంటీ లీక్ చట్టాన్ని అమలు లోకి తీసుకువచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.మరోవైపు  పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం  ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది.ఈ కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పిస్తుంది. అయితే కొత్త చట్టం అవసరమే కానీ ఇది స్కామ్ జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడానికే పనికి వస్తుందని, అసలు లీక్ జరక్కుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అంటున్నారు.