* రాష్ట్రపతి ఆమోదముద్ర
* కేంద్ర న్యాయ శాఖ గెజిట్ జారీ
* తెలంగాణకు నలుగురు, ఏపీకి ఇద్దరు
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీల నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్దరు చొప్పున నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. దీంతో రాష్ట్రపతి ఆమోదం చెప్పారు. ఆ వెంటనే కేంద్ర న్యాయ శాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 11న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్రం ఓకే చెప్పగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
వీరంతా జ్యుడిషియల్ సర్వీస్‌లో ఉన్న న్యాయాధికారులే. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగరావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎడ తిరుమలాదేవి, హైకోర్టు పరిపాలన విభాగం రిజిస్ట్రార్ బొబ్బిలి రామయ్య మధుసూదన్‌రావు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు కాబోతున్నారు.
ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా చేస్తున్న డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కానున్నారు. వీరితో ఆయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ వారంలోనే ప్రమాణస్వీకారం చేయించే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ బదిలీ తర్వాత ఇప్పుడు 26 మంది జడ్జీలు ఉండగా కొత్తవాళ్లు వస్తే ఆ సంఖ్య 30కి చేరుతుంది. ఏపీలో చీఫ్ జస్టిస్‌తో కలిపి ఇప్పుడు 28 మంది ఉండగా కొత్త వాళ్లు ప్రమాణస్వీకారం చేస్తే అక్కడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది. కొత్తగా నియమితు లైన న్యాయమూర్తులు ఈ నెల ౨౫న హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు
హైదరాబాద్‌కు చెందిన నందికొండ పెంట య్య, మణెమ్మ దంపతులకు 1969 మే 3న జన్మించారు. హైదరాబాద్‌లో పాఠశాల కళాశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. సీఎంఆర్ కాలేజీలో 1995లో లా చేశారు. అదే ఏడాది న్యాయవాదిగా నమోదుచేసుకున్నారు. 2012లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపిక అయ్యాక విశాఖపట్నం అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.
జ్యుడిషియల్ అకాడమీలోను గుంటూరు, వరంగల్, ఎల్బీనగర్, సైబరాబాద్ ఎంఎస్ఐగా. న్యాయ శాఖ కార్యదర్శిగా చేశారు. హైకోర్టు జ్యుడిషియల్ ఇన్ఫ్రా రిజిస్ట్రార్‌గా చేశారు. ఇప్పుడు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జస్టిస్ ఈ తిరుమలా దేవి
సంగారెడ్డికి చెందిన ఈ తిరుమలాదేవి 1964 జూన్ 2న జన్మించారు. హైదరాబాద్‌లో చదివారు. లా చేశాక హైకోర్టు తోపాటు జి ల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్‌గా, తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ ఆకాడమీ డైరెక్టర్‌గా చేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, విజిలెన్స్ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జస్టిస్ రేణుక యారా
హైదరాబాద్‌లో ఐలయ్య, నాగమణి దం పతులకు 1973 జూన్ 14న జన్మించారు. హైదరాబాద్‌లోనే పాఠశాల విద్య పూర్తి చేశారు. బషీర్‌బాగ్‌లోని పీజీ కాలేజీ అఫ్ లాలో 1998లో ఎల్ఎల్బీ చేశారు. ఆ తర్వాత ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయం ఎల్ఎల్ఎం చేశారు. 1998లో రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాది అయ్యారు. సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
2012 డిసెంబర్లో జిల్లా జడ్జీగా ఎంపికయ్యారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో చేశారు. వ్యాట్ ట్రిబ్యునల్ జ్యూడిషియల్ సభ్యురాలిగా పనిచేశారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా చేశారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు
ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీ పేటల్లో బీ ఎల్లయ్య, అనసూ య దంపతులకు 1969 మే 25న జన్మించారు. రైల్వే హైస్కూల్లో పాఠశాల విద్య, కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1999లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2012 డిసెంబర్లో జిల్లా జడ్జిగా ఆయన ఎంపికయ్యాక నెల్లూ రు, చిత్తూరు, మేడ్చల్ మల్కాజిగిరి కోర్టుల్లో పనిచేశారు. సీబీఐ కోర్టు ప్రధాన జడ్జిగా, వ్యాట్ జ్యుడిషియల్ సభ్యులుగా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌గా (పరిపాలన) చేస్తున్నారు.