calender_icon.png 28 December, 2024 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు

21-09-2024 12:51:10 AM

  1. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు 
  2. వాలుకా సెమీ కండక్టర్ విస్తరణ  

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సెమీ కండక్టర్ రంగం భారీగా విస్తరించనున్న నేపథ్యంలో పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు, అంకుర సంస్థలు సంసిద్ధంగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం హైటెక్‌సిటీలో వాలుకా సంస్థ విస్తరణ యూనిట్ ప్రారంభోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఈసందర్భంగా సంస్థ పదేళ్లుగా సెమీ కండక్టర్ రంగంలో సాధించిన విజయాలను ప్రశంసించారు. అనంతరం మాట్లాడుతూ వాలుకా సొల్యూషన్స్ తన కార్యకలాపాలను విస్తరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

సాంకేతిక ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణలకు తెలంగాణలో అనుకూల వాతావరణం సృష్టించామని తెలిపారు. వాలుకా సంస్థను రెండేళ్ల క్రితం ఇంటెల్ కంపెనీ కొనుగోలు చేయడం దాని సమర్థతను తెలియజేస్తోందని కొనియాడారు. విస్తరణ వల్ల వాలుకాలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగడం దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం 50 మంది ఉన్న వాలుకా వచ్చే రెండేళ్లలో 500 మందిని నియమించుకుంటుందని ఆయన వివరించారు.

ఇక్కడి ప్రతిభావంతులైన యువతకు ఇది అద్భుత అవకాశమన్నారు. కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ వంటి అధునాతన పరిష్కరాలను అభివృద్ధి చేయడానికి విస్తరించిన సదుపాయాలు ఉపయోగ పడతాయని వాలుకా అధినేత సునీల్ కుమార్ జాస్తి తెలిపారు. దేశంలో సెమీ కండక్టర్ రంగం వైపు యువత ఆసక్తి చూపాలని, చైనా, తైవాన్‌లకు ధీటుగా మన దేశం కూడా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.