calender_icon.png 9 January, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు!

09-01-2025 01:31:38 AM

* మార్చి 31లోపు అన్ని పరీక్షల ఫలితాలు

* జాబ్ క్యాలెండర్ ఆధారంగానే నోటిఫికేషన్లు

* విభాగాల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలివ్వాలని ప్రభుత్వానికి లేఖ

* ఒకట్రెండు సంవత్సరాల్లో పరీక్ష పెట్టిన రోజే ఫలితాలు 

* టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాం తి): ఏప్రిల్ వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. బుధవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలన్నీ ఇవ్వాలని ప్రభుత్వానికి తాము లేఖ రాసినట్లు తెలిపారు.

ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు పూర్తి చేసి, మేలో కొత్త నోటి ఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటే ఏడాదిలోపు, సింగిల్ లేదా పెద్ద పరీక్షలు అయితే గరిష్ఠంగా 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని, చిన్న ఉద్యోగ నోటిఫికేషన్లకు నెల నుంచి రెండు, మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఒకట్రెండు సంవత్సరాల్లో అదే రోజు పరీక్ష పెట్టి అదే రోజు సాయంత్రంలోగా ఫలితాలు ప్రకటించేలా మార్పు లు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ, కీ విడుదల, ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో ఫలితాలకు ముందు కీ ఇవ్వాలా? లేదా? అనేది కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు.

యూపీఎస్సీ విధానాల అమలు..

ఇక నుంచి పరీక్ష ఫలితాలను ఆలస్యం లేకుండా ఇస్తామని చైర్మన్ వెంకటేశం తెలిపారు. అభ్యర్థుల ఎదురుచూపులకు చెక్ పెడ్తామన్నారు. ఇప్పటి వరకు ఫారెస్ట్ నోటిఫికేషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందన్నారు. మార్చి 31లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు. వారం రోజు ల వ్యవధిలో గ్రూప్ 2, 3 ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విధానాలను కొన్నింటిని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ఏడాదికి 13 వేల ఉద్యో గాల నియామకాలు చేపడితే, యూపీఎస్సీ 5 వేల ఉద్యోగాలనే చేపట్టిందన్నారు. యూపీఎస్సీలో పరీక్ష పెట్టి, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎస్‌ఎస్‌సీలో ఇంటర్యూ విధానం లేదన్నారు.

ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తోందని, మన రాష్ట్రంలో గ్రూప్ 2లకు ఇంటర్యూ లేదన్నారు. గ్రూప్ కీని ఈనెల 10 లోపు ఇస్తామని, ఆతర్వాత పది పదిహేను రోజు ల్లో ఫలితాలు ఇస్తామన్నారు. ఎన్ని ఖాళీలు న్నా ఇక నుంచి ప్రతీ ఏడాది నోటిఫికేషన్లు జారీ చేస్తామని, పది పోస్టులు ఉన్నా వంద ఉన్నా పక్కాగా నోటిఫికేషన్లు వెలువడతాయని చెప్పారు. 

వీఆర్వో నియామకాలపై సమాచారం లేదు..

యూనివర్సిటీలోని ప్రొఫెసర్ల నియామ కం, వీఆర్‌ఏ, వీఆర్‌వో నియామకాల గురిం చి తమను ప్రభుత్వం సంప్రదించలేదని, ఒకవేళ అడిగితే చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామ ని చెప్పారు. టీజీపీఎస్సీకి సరిగా నిధుల కేటాయింపులు లేదన్నారు. యూపీఎస్సీకి సంవత్సరానికి కావాల్సిన నిధులు ఏప్రిల్‌లోనే కేటాయిస్తారని ఆయన పేర్కొన్నారు.

నిధుల లేమి కారణంగానే గతంలో ఓ పరీక్ష కు అధిక ఖర్చు అవుతుందని బయోమెట్రిక్ తీసుకోలేదన్నారు. టీజీపీఎస్సీ కార్యాలయా న్ని కూడా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. 87 మంది ఉద్యోగులను డిప్యూటేషన్‌పై సం క్రాంతిలోగా తీసుకోనున్నామని, 550కిపైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ప్రశ్నపత్రాలు, ఇతర సమాచారం లీక్ కాకుండా అత్యాధునిక లాకర్, సైరన్ సిస్టం కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 

11న బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు..

ఈనెల 11, 12న బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు ఉందని వెంకటేశం వెల్లడించారు. అందులో అన్ని రాష్ట్రాల చైర్మ న్లు పాల్గొంటారని, ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న సంస్కరణలపై మేధోమథనం ఉంటుందన్నారు. అలాగే 23న ఆస్కిలో నిర్వహించే కార్యక్రమానికి యూపీఎస్సీ చైర్మన్ హాజరవుతున్నారన్నారు.

పేపర్ల సంఖ్య తగ్గింపుపై ఆలోచిస్తాం..

గ్రూప్ మూడు పేపర్లు, గ్రూప్ నాలుగు పేపర్లకు అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుందని, పేపర్లు ఆ స్థాయిలో ఉండాలా? లేదా? అనేది ఆలోచన చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పారు. అలాగే సిలబస్ తగ్గించే అంశం కూడా పరిశీలిస్తామని, ప్రశ్నల సరళిలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల తయారీలో పారదర్శకత ఉండేలా చూస్తామన్నారు.

ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ 60 లక్షల దరఖాస్తులను కూడా హ్యాండిల్ చేస్తున్నాయన్నారు. ప్రశ్నపత్రాలు లీకేజీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, పరీక్ష రోజు లేదా ముందు రోజు అప్పటికప్పుడు క్వశ్చన్ బ్యాంకు అప్‌డేట్ చేస్తూ దాని నుంచి ప్రశ్నపత్రాలు రూపొందించేలా చర్యలు చేపడ్తామని తెలిపారు. ఒక్కొక్క సబ్జెక్టులో 5 వేల నుంచి 10 వేల వరకు బిట్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తామన్నారు.

పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ విధానం, ఇన్విజిలేటర్లకు విధులు, పరీక్షల సెంటర్ల కేటాయింపుపై అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, క్యాస్ట్ వెరిఫికేషన్ టీజీపీఎస్సీ చేయకుండా, ఉద్యోగాలు వచ్చాక ఆయా శాఖలు చూసుకునేలా ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎస్సీ రిజర్వేషన్లపై  ప్రభుత్వ నిర్ణయమే..

ఎస్సీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని చైర్మన్ ప్రకటించారు.  కొంత మంది టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు, ఫలితాలు, పరీక్షలు వాయిదా వేయించాలని, సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపారు. కొన్ని రాజకీ య పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పారు.

దీంతో అభ్యర్థులకు నమ్మకం లేకుండా పోతోందన్నారు. ఇక నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ముందే నోటిఫికేషన్‌లో అన్ని వివరాలు ఇస్తామని పేర్కొన్నారు.