- హైదరాబాద్‌లో పెట్టుబడికి క్యాపిటల్ ల్యాండ్ ఒప్పందం
- * 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
- సింగపూర్‌లో కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
- పాల్గొన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు బృందం
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): హైదరాబాద్ ‘ఐటీ సెక్టార్’ సిగలో మరో మణిహారం చేరనున్నది. క్యాపిటల్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ సంస్థ త్వరలో నగరంలో రూ.450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్క్‌ను నిర్మించనున్నది. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థల్లో మేటి.
ఈ సంస్థ హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్‌ను చేపట్టనున్నది. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సారథ్యంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం సదరు కంపెనీ ప్రతినిధులతో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలోనే ఆ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడతామని అధికారికంగా ప్రకటించారు. ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, టీజీ ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఇం డియా మేనేజ్‌మెంట్ సీఈవో గౌరీశంకర్ నాగభూషణం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ పాల్గొన్నారు.
అత్యాధునిక సదుపాయాలు
క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్మించనున్న ఐటీ పార్కులో బ్లూచిప్ కంపెనీలు కోరుకునే అత్యాధునిక సదుపాయాలు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లకు అనువైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ పార్క్ రాకతో హైదరాబాద్ ఐటీ ఇమేజ్ మరింత పెరుగుతుందని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక ప్రాజెక్టులు ప్రారంభించింది.
ఇప్పటికే అంతర్జాతీయ టెక్ పార్క్ (ఐటీపీ హెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెర్ల్ పార్క్‌లను విజయవంతంగా నడిపిస్తున్నది. కంపెనీ జూలై లేదా ఆగస్టులో 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్‌నూ అందుబాటులోకి తీసుకురానున్నది. అలాగే ఐటీపీహెచ్ రెండో దశ పనులను 2028 నాటికి పూర్తి చేయనున్నది.
మరో మైలురాయి: సీఎం రేవంత్‌రెడ్డి
క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ పెట్టుబడుల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించారు. కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలు రాయిగా నిలు స్తుందని ఆకాంక్షించారు.
అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి: గౌరీశంకర్ నాగభూషణం
సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో హై దరాబాద్ అన్నిరంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధిస్తున్నదని క్యాపిటల్ ల్యాం డ్ కంపెనీ ఇండియా మేనేజ్‌మెంట్ సీఈవో గౌరీశంకర్ నాగభూషణం కొనియాడారు. తమ సంస్థ తెలంగాణలో బిజినెస్ విస్తరిస్తుండటం తనకు ఆనందానిచ్చిందని చెప్పారు.