“నా మతం సైన్స్. నేను సైన్స్‌నే పూజిస్తాను, ప్రేమిస్తాను. నా బతుకంతా సైన్సే” అని సగర్వంగా ప్రకటించిన మహానుభావుడు సి.వి.రామన్. “ఎన్నో ఆవిష్కరణలకు మూలం సైన్స్. ప్రపంచం గర్వించేలా మన భారతీయ సైన్స్ ఎదగాలి. మన ప్రయోగాలతో ఇతర దేశస్తులు స్ఫూర్తిని పొందాలి” అనే వారాయన. రామన్ ఒక విజ్ఞానశాస్త్ర ధృవతార. భౌతిక శాస్త్రవేత్తగా అద్భుత ఆవిష్కరణలకు ప్రాణం పోశారు. 1930 డిసెంబరులో రామన్‌కు ‘నోబెల్ బహుమతి’ లభించగా, 1954లో భారత ప్రభుత్వం ఆయనను ‘భారతరత్న’ పురస్కారంతో గౌరవించింది. ఆయన పరిశోధనా ఫలితాన్ని ధ్రువ పరిచిన రోజును (ఫిబ్రవరి 28) ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గానూ ప్రభుత్వం ప్రకటించింది.
చంద్రశేఖర్ వెంకట రామన్ 1888 నవంబర్ 7న తిరుచిరాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయమే వారి జీవనాధారం. రామన్ విశాఖపట్నంలో ప్రాథమి క విద్యాభ్యాసం చేశారు. చిన్నతనం నుంచి విజ్ఞానశాస్త్ర విషయాలపట్ల అమితాసక్తిని ప్రదర్శించేవారు. తండ్రి భౌతికశాస్త్ర అధ్యాపకులు కావడం మరింతగా కలిసివచ్చింది.
రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి) చేశారు. 1907లో ఎంయస్‌సీ (ఫిజిక్స్)లో యూనివర్సిటీ ప్రథముడిగా నిలిచారు. 18వ ఏట నే ‘కాంతి ధర్మాల’పై వారి పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ‘ఫిలసాఫికల్’ మేగజైన్‌లో ప్రచురితమవడం విశేషం.
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా
రామన్‌లోని పరిశోధనాభిరుచిని గమనించిన అధ్యాపకులు ఆ మేరకు ప్రోత్సహి స్తూ, ‘ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయ’మన్నారు. కానీ, ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు, ‘ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరి పడడని’ తేల్చడంతో ప్రయాణం విరమించుకున్నారు. “నన్ను అన్‌ఫిట్ చేసిన ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను” అని తర్వాత రామన్ పేర్కొ న్నారు. ఎమ్మే చదివాక ఆర్థికశాఖలో ఉద్యోగంలో చేరారు. 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు.
అక్కడి ‘ఇండియన్ సైన్స్ అసోసియేషన్’కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసేవారు. రామన్ ఆసక్తిని గమనించిన ‘కలకత్తా విశ్వవిద్యా లయం’ అప్పటి ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ, ‘రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని’ సూచించారు. దానికి బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించారు.
తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ పాసై, కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో ‘డిప్యూటీ అకౌంటెంట్ జనరల్’గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు రామన్‌కు లోకసుందరి అమ్మాళ్‌తో పెళ్ళయిం ది. ఒకసారి కలకత్తాలో ప్రయాణిస్తున్నప్పు డు బౌబజారు స్ట్రీట్‌వద్ద ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ అనే బోర్డు చూసి పరుగున వెళ్ళారు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలా ల్ సర్కార్‌ను కలిసి, పరిశోధన చేయడానికి అనుమతిని పొందారు.
తెల్లవారు జాము న ఐదున్నరకే ‘ఐసీఎస్’కు వెళ్ళేవారు. ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధనలు. ఆదివారాలు, సెలవు దినా లు కూడా పరిశోధనలలోనే గడిచేవి.
శబ్ద రహస్యం బట్టబయలు
ఆయన తల్లి పార్వతి అమ్మాళ్‌కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందు కే, రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధ న తృష్ణతో తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ‘కలకత్తా యూనివర్సిటీ’లో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా చేరారు. 1921లో లం డన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు.
అప్పుడు శ్రోతల్లోని ఒకరు, “ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యు డవు కావాలని అనుకుంటున్నావా?” అనడంతో తనలో మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతిశాస్త్రం వైపు మళ్లించారు. తిరుగు ప్రయాణంలో ఓడలో వెళుతున్నప్పుడు ‘ఆకాశం, సముద్ర నీరు రెండూ నీలిరంగులో ఉండటం’ ఆయనను ఆలోచింపచేసింది. “అప్పటి దాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలిరంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటిగుండా కాంతి ప్రవహించేటప్పుడు అది పరిక్షేపణం చెందడ మే” అని ఆయన గ్రహించారు.
ఆ అద్భుత ప్రభావానికి మూలం
కలకత్తా చేరగానే తన అంచనాను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు, కాంతి పరిక్షేపణం గురించిన పరిశోధనలు జరిపారు. ఫలితంగా ఆవిర్భవించిందే ‘రామన్ ఎఫె క్ట్’. ‘పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింప చేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది’ అన్నది ఇందు లోని సూత్రీకరణ. 1928 మార్చి 16న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సు లో దీనిని విజయవంతంగా ప్రదర్శించారు.
దాంతో బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ‘రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని, 200 రూపాయలైనా ధర చేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమని’ ప్రపంచ శాస్త్రజ్ఞులంతా ఆయనను అభినందించారు. 1930లో ‘నోబెల్ బహుమతి’ లభించింది.
భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై ఎంతగానో పాటుపడ్డ రామన్ మహనీయుడు 1970 నవంబర్ 21న కన్నుమూశారు. విద్యార్థులు, పరిశోధకులు సహా ప్రభుత్వాలుకూడా అమూల్యమైన ఆయన సేవల ను, కృషిని ఆదర్శంగా తీసుకొని ముందు కు సాగినప్పుడే దేశం మరింతగా గర్వించదగ్గ స్థాయికి చేరుకోగలదు.