calender_icon.png 4 October, 2024 | 6:55 AM

ఐటీడీఏల పరిధిలో కొత్త ఆసుపత్రులు

04-10-2024 01:04:59 AM

గిరిజనులు అరగంటలో చేరుకునేలా హాస్పిటల్స్ నెట్‌వర్క్

108 వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్సులు

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

హైదరాబాద్, అక్టోబర్ 3(విజయక్రాంతి): ఐటీడీఏ పరిధిలో కొత్తగా సబ్ సెంటర్లు, పీహెసీలు, సీహెసీల ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అలాగే, ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు.

గురువారం హైదరాబాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో రాష్ర్టంలోని మన్ననూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆస్పత్రులపై మంత్రి దామోదర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో ప్రజలు తమ ఆవాసాల నుంచి అరగంట లోపలే చేరుకునేలా హాస్పిటల్స్ నెట్‌వర్క్ ఉండాలని సూచించారు.

ఇందుకు అనుగుణంగా కొత్త సబ్ సెంటర్లు, పీహెసీలు, సీహెసీల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉండాలని ఐటీడీఏల ప్రాజెక్ట్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. ఐటీడీఏ పరిధిలో ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు.

రోడ్ కనెక్టివిటీ సరిగాలేని ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఆరోగ్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

త్వరలో ఏఎంఆర్ అమలు.. 

తెలంగాణ రాష్ట్ర యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్)ను త్వరలో నే అమలు చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సిం హ తెలిపారు. తెలంగాణ ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్‌ను హైదరాబాద్‌లో గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో ఏఎంఆర్‌ను కేరళ మొదట ప్రారంభించగా, అనంతరం మరో ఐదు రాష్ట్రాలు తమ ప్రణాళికలను ప్రారంభించాయని వెల్లడించారు. తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు.