యూపీలో కొనసాగుతున్న ఆపరేషన్ భేడియా
లక్నో, సెప్టెంబర్ 2: ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలో చిన్నారులను చంపేస్తున్న తోడేళ్లను పట్టుకొనేందుకు అటవీ శాఖ అధికారులు కొత్తకొత్త ఉపాయాలు అమలుచేస్తున్నారు. ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటికే నాలుగు తోడేళ్లను బంధించారు. మిగతావాటిని పట్టుకొనేందుకు బోన్లు ఏర్పాటుచేసినా అవి చిక్కటం లేదు. దీంతో చిన్నారుల మూత్రంతో తడిపిన ఆటబొమ్మలను అడవిలో అక్కడక్కడ ఏర్పాటు చేసి ఉచ్చులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ తోడేళ్ల గుంపు దాడిలో ఇప్పటికే ఏడుగురు చిన్నారులు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. దీంతో చీకటిపడితే అయితే చాలు ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. తోడేళ్లు నిత్యం ఆవాసాలు మారుస్తుండటంతో వాటిని పట్టుకోవటం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. ఆదివారం కూడా వీటి దాడుల్లో ఒక చిన్నారి మరణించగా, ఇద్దరు మహిళలు గాయపడ్డారు.