calender_icon.png 2 November, 2024 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కొత్త గవర్నర్ ప్రమాణం

31-07-2024 12:37:51 AM

  1. బాధ్యతలు చేపట్టనున్న జిష్ణుదేవ్ వర్మ
  2. ప్రమాణం చేయించనున్న రాష్ట్ర సీజే

అగర్తల, జూలై 30: తెలంగాణ కొత్త గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత గవర్నర్‌గా ప్రమాణం చేయిస్తారు. తాను బుధవారం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు జిష్ణువర్మే స్వయంగా ప్రకటించారు. అగర్తలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘త్రిపుర నుంచి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా ఎంపికైన తొలి వ్యక్తిని నేనే. నిజానికి శనివారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ నాకు ఫోన్‌చేసేంత వరకు నాకు ఈ విషయం తెలియదు. ఆయన నాకు ఫోన్‌చేసి త్రిపుర రాష్ట్రం వెలుపల పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధమని నేను చెప్పాను. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాకు ఫోన్ చేసి రాష్ట్రానికి స్వాగతం పలుకుతున్నట్టు చెప్పారు. అప్పుడే నేను తెలంగాణ గవర్నర్‌గా వెళ్లనున్నట్టు తెలిసింది’ అని వెల్లడించారు. 

రామమందిరం నుంచి రాష్ట్ర గవర్నర్ వరకు

జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబ వారసుడు. ఆ రాజకుటుంబాన్ని కర్త అని కూడా పిలుస్తారు. ఆయన 1957 ఆగస్టు 15న జన్మించారు.1990 దశకంలో రామ మందిర ఉద్యమం జోరుగా సాగుతున్నవేళ ఆయన బీజేపీ తరఫున ఆ ఉద్యమంలో చేరారు. అదే ఆయన మొదటి రాజకీయ ప్రవేశం. ఆ తర్వాత త్రిపురలో బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అసలే రాజకుటుంబీకుడిగా పేరు ఉండటంతో రాజకీయాల్లోనూ రానించారు. 2018 నుంచి 23 వరకు త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

చరిలామ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన ప్రస్తుతం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ప్రధాని మోదీతోపాటు ఆరెస్సెస్ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. జిష్ణుదేవ్ వర్మ సుధా దేవ్ వర్మను వివాహం చేసుకొన్నారు. వీరి ఇద్దరు కుమారులు. ఈ నెల 27న ఆయనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ నాలుగో గవర్నర్‌గా నియమించింది.