ప్రధాని సన్నిహితునికి పదవి దక్కే అవకాశాలు
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం తెలంగాణకు ఇన్‌చార్జి గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ పుదుచ్చేరి, జార్ఖండ్ రాష్ట్రాలకూ గవర్నర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి త్వరలోనే పూర్తి స్థాయి గవర్నర్ వస్తారని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మాజీ మంత్రి, బీహార్ రాజకీయ నేత అశ్వినీ కుమార్ చౌబేను తెలంగాణ గవర్నర్‌గా పంపించేందుకు మార్గం సుగమం అయినట్లుగా తెలుస్తోంది. 1995లో తొలిసారి బీహార్‌లో ఎమ్మెల్యేగా ఎంపికైన చౌబే, బక్సర్ నుంచి ఎంపీగాను గెలిచారు.
రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గత ఏన్డీఏ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. 2024 ఎంపీ ఎన్నికల్లో ఆయనకు అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. అయినా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. పార్టీకి వీర విధేయునిగా చౌబేకు పేరుంది. అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రక్రియలో అశ్వినీకుమార్ కీలకపాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమించనున్నారని తెలుస్తోంది.
2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ... పార్టీకి బాగా నమ్మదగ్గ వ్యక్తిగా పేరున్న చౌబేను రాష్ట్రానికి గవర్నర్‌గా పంపనుందని పార్టీ నేతలు కూడా అంటున్నారు. మరోవైపు ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న చౌబే నియామకం కేవలం లాంఛనమేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సాధ్యమైనంత త్వరగానే ప్రకటన వస్తుందని తెలుస్తోంది.