calender_icon.png 19 January, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడిగడ్డ కోటలో కొత్త కొట్లాట

05-07-2024 12:10:04 AM

  • కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్యే బండ్ల ఆసక్తి 
  • వ్యతిరేకిస్తున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు
  • గాంధీభవన్‌ను ముట్టడించనున్న జెడ్పీ చైర్‌పర్సన్ వర్గం

గద్వాల (వనపర్తి), జూలై 4 (విజయక్రాంతి): నడిగడ్డ కోటలో కొత్త పంచాయితీ మొదలైంది. అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ క్యాడర్ కలవరపడుతున్నది. గతంలో బీఆర్‌ఎస్‌లోనే కొనసాగిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సరిత మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ విభేదాలు నెలకొనడంతో సరిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో బండ్ల కృష్ఱమోహన్‌రెడ్డి మీద అమీతుమీ తేల్చుకునేం దుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన సరిత.. రెడ్డి రాజకీయాని ఢీకొనలేకపోయారు.

ప్రజల నుంచి విశేష ఆదరణ పొందినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయంలో మాత్రం ఆమె నెగ్గలేకపోయారు. అతి తక్కువ ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సరిత క్యాడర్ ఉపశమనం పొందారు. అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ సరిత వర్గం కాంగ్రెస్ గెలుపుకోసం విశేష కృషి చేశారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నుంచి క్రమంగా వలస లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సైతం అధికార కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తున్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలోనూ జోరుగ చర్చ నడుస్తున్నది.

అయితే దాదాపుగా ఆయన చేరిక ఖరారు అయినట్లుగా సరిత వర్గం భావిస్తోంది. దీంతో సరిత వర్గం నిరసన గళాన్ని వినిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువుగా ఉండి, పార్టీని వ్యతిరేకించిన బండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవద్దని హైకమాండ్‌ను హెచ్చరిస్తున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ సరిత కూడా హైకమాండ్ పెద్దలతో ఎమ్మెల్యే బండ్ల రాకను వ్యతిరేకిస్తూ తన గోడును వెల్లబోసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అతంత్య కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ బీసీలను ఐక్యం చేసేందుకు తెర వెనుక ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం అవుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ గద్వాల ప్రజల్లో నెలకొంది. 

నేడు గాంధీభవన్ ముట్టడి?

కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రాకను నిరసిస్తూ జడ్పీ చైర్‌పర్సన్ సరిత క్యాడర్ గురువారం గద్వాల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ను ముట్టడించనున్నట్లు సమాచారం. ఈ పంచాయితీ గాంధీభవన్ ముట్టడితో ఆగుతుందా లేక హస్తినా వరకు వెళ్తుందా అని గద్వాల ప్రజలు చర్చించుకుంటున్నారు.