న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ కొన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. ట్యాబ్‌లెట్లు, ఓఎస్ పవర్ వాచ్‌లు, స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. కంటి చూపు సరిగా లేనివారు డిజిటల్ కంటెంట్‌ను నావిగేట్ చేయడాన్ని సులభతరం చేసేందుకు గూగుల్ టాక్‌బ్యాక్ పేరుతో ఇదివరకే ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
తాజాగా గూగుల్ తీసుకొచ్చిన అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఏఐ జెమిని సాయంతో ఈ టాక్‌బ్యాక్ ఫీచర్‌ను మరింత వివరంగా అందిస్తోంది. ఏదైనా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ ఫొటో లోని వ్యక్తులు, వారు ధరించిన దుస్తులు, చుట్టూ పరిసరాలు.. ఇలా అన్నీంటిని ఈ టాక్‌బ్యాక్ వివరిస్తోంది.
సర్కిల్ టు సెర్చ్..
మనమేదైనా పాటను వినగానే బాగుందనిపిస్తే ఆ పాట ఎందులోనిదంటూ వెతుకుతాం. ఇకపై అలాంటి అవసరం లేకుండా కేవలం మన సెల్‌లోని హోమ్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ప్లే అవుతున్న పాటను వెంటనే గుర్తించి స్క్రీన్‌పై డిస్‌ప్లే చేస్తుంది. పాటకు సంబంధించిన వివరాలను మన ముందుంచుతుంది. వీటితో పాటు వాచ్‌లోనే గూగుల్ మ్యాప్స్, భూకంపం లాంటి విపత్తుల వచ్చినప్పుడు ముందే గ్రహించి యూజర్లకు హెచ్చరికలు జారీ చేసేలా కొత్త ఫీచర్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది.