calender_icon.png 20 October, 2024 | 3:14 AM

టాలీవుడ్‌కు కొత్త ఇస్మయిల్స్!

25-07-2024 12:05:00 AM

‘సలార్’, ‘కల్కి2898ఏడీ’ చిత్రాలతో రికార్డులు కొల్లగొట్టారు టాలీవుడ్ కథానాయకుడు ప్రభాస్. దీంతో ఈ పాన్ ఇండియా స్టార్ తర్వాతి చిత్రాలపై భారతీయ సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కమిట్ అయిన మూడు ప్రాజెక్టులు ప్రస్తుతానికి ఆయన చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి ‘స్పిరిట్’ కాగా, రెండోది ‘సలార్ ‘రాజాసాబ్’ కూడా ప్రభాస్ చేయాల్సిన మరో ప్రాజెక్టు. వీటితోపాటు ‘సీతారామం’ డైరెక్టర్ హను రాఘవపూడితో సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా ఈ నాలుగో చిత్రం గురించి కూడా వార్తలు జోరందుకున్నాయి.

ప్రస్తుతానికి ఆ సినిమా టైటిల్ ‘ఫౌజి’గా ప్రచారంలో ఉండగా, హీరోయిన్ విషయమై కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ప్రభాస్ రాఘవపూడి కాంబోలో రానున్న చిత్రం ‘ఫౌజి’లో కథానాయిక నిన్న మొన్నటి దాకా పాకిస్థానీ నటి సజల్ అలీ పేరు వినిపించింది. కానీ, ప్రభాస్‌తో జోడీ కట్టనున్నది పరదేశీ కాదు, స్వదేశీనే అనీ, ఆ ఇండియన్ బ్యూటీ పేరు ఇమాన్ ఇస్మాయిల్ అనేది తాజా టాక్. లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని చిత్ర సన్నిహిత వర్గాల నుంచి అందిన నమ్మదగిన సమాచారం.

ఇక్కడున్న ఫొటోలో చలువ కళ్లద్దాలతో కనువిందు చేస్తున్న ఈ శీతల ప్రాంతపు భావి సితార స్వస్థలం.. దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరమే! తరుచూ తన డ్యాన్స్ వీడియోలను వదులుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ సుందరి మంచి డ్యాన్సరే కాదు, కొరియోగ్రాఫర్ కూడా. ఇమాన్ ఇస్మాయిల్.. ప్రభాస్‌ను, హను రాఘవపూడిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతోంది.. వీళ్లిద్దరు కూడా ఆమె ఫాలోవర్స్ జాబితాలో ఉన్నారు! అదీగాక ఈ ‘హిమ’పురి ఇంతి ఇమాన్.. చక్కగా స్మైల్ ఇస్తూ ‘పుష్ప’ మూవీలోని ‘సామి సామి..’, ‘జైలర్’ చిత్రంలోని ‘వా నువ్ కావాలయ్యా..’ వంటి తెలుగు పాటలకు స్టెప్పులేస్తున్న హాట్ హాట్ వీడియోలు కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతున్నాయి.

అన్నట్టూ ‘ఫౌజి’కి ఆగస్టు 22న పూజా కార్యక్రమం జరుగనుందని కూడా అంటున్నారు. దీంతో ఈ కొత్త అందానికి ‘వెల్‌కమ్ టు టాలీవుడ్..’ అంటూ అప్పుడే స్వాగత కార్యక్రమానికి కూడా తెర తీసింది దక్షిణాది ప్రేక్షక లోకం.