calender_icon.png 6 November, 2024 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో కొత్త విద్యుత్ విధానం

04-11-2024 02:43:36 AM

  1. నిష్ణాతులతో చర్చించి విధివిధానాలు ప్రకటిస్తాం
  2. అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి
  3. విద్యుత్ రంగంలో దేశానికి తలమానికంగా తెలంగాణ
  4. వచ్చే వేసవి నాటికి యాదాద్రి విద్యుత్ కేంద్రం పూర్తి
  5. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
  6. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి వైటీపీఎస్ ఒకటో యూనిట్‌ను విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం

నల్లగొండ, నవంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో త్వరలో నూతన విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఒకటో యూనిట్‌లో ప్రారంభించిన విద్యుత్ ఉత్పత్తిని ఆదివారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి గ్రిడ్‌కు అనుసం ధానించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు.

విద్యుత్ నిష్ణాతులు, మేధావులు, ప్రజాభిప్రాయం సేకరించి అసెంబ్లీలో చర్చించిన అనంతరం కొత్త విధానం విధివిధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది మే వరకు పవర్ ప్లాంట్‌ను పూర్తిచేసి 4 వేల మెగావాట్ల పూర్తిస్థాయి విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు.

సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. బహుళ జాతి కంపెనీలు, నూతన పరిశ్రమలు, మార్కెటింగ్, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రీన్ వపర్‌ను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు.

రాష్ట్రంలో థర్మల్, జల, సౌర, పవన తదితర అన్నిరకాల విద్యుత్ ఉత్పాదన చేపట్టి తెలంగాణను దేశానికే తలమానికంగా నిలుపుతామని చెప్పారు. 2028 నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 22,488 మెగావాట్లు ఉండొచ్చని అంచనాలున్నాయని,  2034 నాటికి ఇది 32 వేల మెగావాట్లకు చేరే అవకాశముందని వెల్లడించారు.

రాష్ట్రాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు భవిష్యత్‌లో నాణ్యమైన విద్యుత్ అందించేలా ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు సర్కారు ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్తున్నదని స్పష్టంచేశారు. అనంతరం వపర్ ప్లాంట్ పనుల పురోగతిని ఎన్టీపీసీ ఇంజినీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు మంత్రులు ఏరియల్ సర్వే ద్వారా పవర్‌ప్లాంట్ పరిసరాలను పరిశీలించారు. రామగుండం నుంచి వైటీపీఎస్‌కు బొగ్గును తీసుకువచ్చే రైలును దామరచర్ల (వైటీపీఎస్ టేక్ ఆఫ్ పాయింట్) వద్ద  జెండా ఊపి ప్రారంభించారు.

మంత్రుల బృందానికి హెలిప్యాడ్ వద్ద డీసీసీ శంకర్‌నాయక్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ స్వాగతం పలికారు. మంత్రుల వెంట రాష్ట్ర ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి, యాదాద్రి పవర్ ప్లాంట్ చైర్మన్ సందీప్ కుమార్ సుల్తానియా, టెక్నికల్ డైరెక్టర్ అజయ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ సచ్చిదానంద, చీఫ్ ఇంజినీర్లు సమ్మయ్య, సీసీఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.