calender_icon.png 14 November, 2024 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్

13-11-2024 02:02:15 AM

  1. అవసరానికి సరిపడేలా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల భర్తీ
  2. కలెక్టరేట్లలో విచారణ విభాగాలు ఏర్పాటు
  3. ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ టీమ్
  4. డీసీఏ అధికారులతో రివ్యూలో మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే, విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు.

మంగళవారం డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) అధికారులతో వెంగళరావునగర్‌లోని డీసీఏ ఆఫీసులో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ తయారీ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు.

ఫార్మా సంస్థలు ఉన్న చోట డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను అదనంగా నియమించాలన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు  కలెక్టరేట్లలో విచారణ విభాగాలను  ఏర్పాటు చేయాలని సూచించారు. మెడిసిన్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు, ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ ఏడాది 21,639 తనిఖీలు నిర్వహించి 3,416 సంస్థలపై (మెడికల్ షాప్స్, మానుఫాక్చరింగ్ యూనిట్స్) చర్యలు తీసుకున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. రాష్ర్టంలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఒక్కటే ఉండడం వల్ల ఎక్కువ శాంపిల్స్‌ను టెస్ట్ చేయలేకపోతున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ల్యాబ్‌లో నెలకు గరిష్టంగా 400 శ్యాంపిల్స్ మాత్రమే పరీక్షించగలుగుతున్నామని.. ఈ ఏడాది ఇప్పటివరకూ 3,255 శ్యాంపిళ్లను మాత్రమే టెస్ట్ చేసినట్లు మంత్రికి వివరించారు. 

ప్రతిపాదనలు సిద్ధం చేయండి..

హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణతోపాటు కొత్తగా 4 ల్యాబ్‌ల ఏర్పాటుకు.. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సీఎంతో చర్చించి అవసరమైన మేర డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు మంజూరు చేయిస్తామని తెలిపారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను ఇతర డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పరిధిలోని సంస్థల్లో తనిఖీలకు పంపించాలని డీజీ కమలాసన్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు.

మెడిసిన్ ధరలు, నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లఘించే ఆసుపత్రుల సమాచా రాన్ని డీఎంహెచ్‌వోలకు అందజేయాలని, ఆయా హాస్పిటళ్లపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానలకు పంపిణీ చేసే మెడిసిన్ కొనుగోలు విషయంలో టీజీఎంఎస్‌ఐడీసీకి అవసరమైన సహకారాన్ని డీసీఏ(డ్రగ్ కంట్రోల్ అథారిటీ) అందించాలని సూచించారు.

టీజీఎంఎస్‌ఐడీసీకి మెడిసిన్ సప్లు చేసే సంస్థల తయారీ యూనిట్లను డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేయాలని.. శ్యాంపిల్స్‌ను సేకరించి టెస్ట్ చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోయినా, నాసిరకం మెడిసిన్ అని తేలినా, ఆయా సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. టీజీఎంఎస్‌ఐడీసీ పరిధిలో ఉండే సెంట్రల్ మెడికల్ స్టోర్స్‌ను కూడా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేయాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన మందులు అందించేలా డీసీఏ, టీజీఎంఎస్‌ఐడీసీ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీసీఏ డీజీ విబి.కమలాసన్‌రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి.రాందాన్ తదితరులు పాల్గొన్నారు.