calender_icon.png 30 April, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సీఎస్ రామకృష్ణారావు

28-04-2025 02:24:37 AM

  1. ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం 
  2. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి పదవీవిరమణ నేపథ్యంలో నిర్ణయం
  3. ఇతర ఐఏఎస్‌లను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి కే రామకృష్ణారావును నియమించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత  సీఎస్ శాంతికుమారి ఈనెల 30వ తేదీన పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంతకాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం.. రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారులు పోటీలో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 1991ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని నిర్ణయించింది.

రామకృష్ణారావు 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఎస్ నియామకంతో పాటు వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్‌లను కూడా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

* గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ - శశాంక్ గోయల్

* ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈవో - జయేశ్ రంజన్

* పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- సంజయ్‌కుమార్

* కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - దాన కిశోర్

* ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ - స్మితాసబర్వాల్

* పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి - టీకే శ్రీదేవి

* మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి - ఇలంబర్తి

* జీహెచ్‌ఎంసీ కమిషనర్ - ఆర్వీ కర్ణన్ 

* ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ - కే శశాంక

* జెన్ కో సీఎండీ - ఎస్.హరీశ్

* రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో - నిఖిల

* ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ - సంగీత సత్యనారాయణ

* దేవాదాయశాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈవో - ఎస్.వెంకటరావు

* సెర్ప్ అదనపు సీఈవో - పీ కాత్యాయనీదేవి

* ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈవో - ఈవీ నర్సింహారెడ్డి

* జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ - హేమంత్ సహదేవ్‌రావు

* టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ - ఫణీంద్రారెడ్డి

* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింగ్ కమిషనర్ - కధిరవన్

* హైదరాబాద్ అదనపు కలెక్టర్  - విద్యాసాగర్

* హెచ్‌ఎండీఏ సెక్రటరీ - ఉపేందర్‌రెడ్డి