- పెద్దపల్లి, ఏటూరునాగారంలో కొత్త బస్ డిపోలు
- డిపోలు, బస్‌స్టేషన్ల కోసం రూ.60.2 కోట్లు విడుదల
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జనవరి 18(విజయక్రాంతి): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్రంలో ఆర్టీసీ రద్దీ భారీగా పెరిగిందని అందుకు అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో రెండు కొత్త బస్ డిపోల నిర్మాణంతో పాటు బస్ స్టేషన్ల ఏర్పాటు, విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతి తెలిపిందని, ఇందుకోసం రూ. 60.2 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 97 డిపోలతో పాటు అన్ని బస్‌స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఓ వైపు కొత్త బస్సులను కొనుగోలు చేస్తూనే..
మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. బోర్డు అనుమతి లభించిన పెద్దపల్లి, ఏటూరునాగారం నూతన డిపోలు, బస్ స్టేషన్లను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు.
విడుదల చేసిన నిధుల వివరాలు..
* పెద్దపల్ల్లిలో బస్‌డిపో నిర్మాణానికి రూ.11.70 కోట్లు
* ములుగు జిల్లా ఏటూరునాగారంలో బస్‌డిపో రూ.6.28 కోట్లు
* ములుగులో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.5.11 కోట్లు
* సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కొత్త బస్‌స్టేషన్ రూ.3.75 కోట్లు
* ఖమ్మం జిల్లా మధిరలో ఆధునిక బస్‌స్టేషన్ నిర్మాణం రూ.10 కోట్లు
* ములుగు జిల్లా మంగపేటలో కొత్త బస్‌స్టేషన్ రూ. 51 లక్షలు
* పెద్దపల్లి జిల్లా మంథని బస్‌స్టేషన్ విస్తరణ రూ.95 లక్షలు
* సూర్యాపేట జిల్లా కోదాడలో ఆధునిక బస్ స్టేషన్ రూ.17.95 కోట్లు
* కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకై బస్‌స్టేషన్ రూ.3.95 కోట్లు