- 2025 ఫిబ్రవరి ముహూర్తం
- కొత్త ముఖం ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: కొత్త సంవత్సరంలో బీజేపీకి నూతన రథసారధి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలోపు ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిబ్రవరి కంటే ముందుగానే కొత్త వ్యక్తి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం కూడా ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. బీజేపీ అధ్యక్ష ఎన్నికకు కావాల్సిన ప్రక్రియను (రాష్ట్రాల్లో బీజేపీ లీడర్ల పోలింగ్) త్వరలోనే ప్రారంభించాలని పార్టీ అగ్రనాయకత్వం చూస్తోందని సమాచారం.
బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ద్వారానే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉం టుంది. ‘ఫిబ్రవరిలోపు బీజేపీ పగ్గాలను కొత్త అధ్యక్షుడు స్వీకరిస్తాడని మేము అనుకుంటున్నాం’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైనా బీజేపీ అధ్యక్షుడిగా వస్తారా? లేక కొత్త వ్యక్తిని ఎన్నుకుంటారా అనే విషయంలో ఎటువంటి క్లారిటీని ఇవ్వలేదు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నడ్డా 2020 ఫిబ్రవరి నుంచి బీజేపీకి సారథిగా వ్యవహరిస్తున్నారు. నడ్డా సారథ్యంలోనే బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకుంది. తెలంగాణ బీజేపీ సారథి ఎవరనేది కూడా ఉత్కంఠగా మారింది. ఫిబ్రవరి రెండోవారం తరువాత రాష్ట్ర కొత్త అధ్యక్షున్ని ఎన్ను కోనున్నారు.