- వెనుకబడిన వర్గాలకే పదవుల్లో సింహభాగం
- త్వరలో మరో 14 జిల్లాలకు..
హైదరాబాద్, ఫిబ్రవరి3 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందు ప్రకటించిన విధంగానే సంస్థాగత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యమిచ్చింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాలకు పార్టీ జిల్లాల అధ్యక్షులతో పాటు 52 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను నియమించింది. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ జాబితా విడుదల చేశారు.
జిల్లాల అధ్యక్ష పదవుల్లో సింహభాగం బీసీలకే దక్కాయి. 12 స్థానాల్లో బీసీలకు అవకాశం లభించగా, ఆరుచోట్ల ఓసీలు, ఒకచోట ఎస్సీ నేతకు అవకాశం లభించింది. నాలుగుచోట్ల మున్నూరు కాపులకు, మూడుచోట్ల గౌడ్స్‌కు పదవులు వరించాయి. ముదిరాజ్, వాల్మీకీ బోయ, మరాఠా, విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఒక్కో జిల్లాలో అవకాశం లభించింది.
ఓసీలకు దక్కిన పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే దక్కడం, ఎస్టీ సామాజికవర్గానికి ఒక్కచోటైనా అవకాశం లేకపోవడం గమనార్హం. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక కోసం కోరం ఉండాలనే ఉద్దేశంతోనే అధిష్ఠానం ప్రస్తుతానికి 19 జిల్లాల అధ్యక్షులను భర్తీ చేసినట్లు తెలుస్తోంది.
మిగతా జిల్లాల పార్టీ అధ్యక్షులను పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించిన వారికే జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే కరీంనగర్, సిరిసిల్ల, జోగుళాంబ గద్వాల, నారాయణపేట తదితర జిల్లాల్లో ఆశావహులు ఎక్కువగా ఉన్నందున, ప్రస్తుతానికి ఆయాచోట్ల అధ్యక్షులను నియమించలేదని తెలుస్తోంది.
మహిళల ప్రాతినిథ్యమేది..?
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదే అని చెప్పుకొంటున్న బీజేపీ.. పార్టీ 19 జిల్లాల అధ్యక్ష పదవుల్లో ఒక్క మహిళకైనా చోటుకల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 52 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల్లోనూ ఒకేఒక మహిళ ఉండడం గమనార్హం. అధిష్ఠానం తీరుపై పార్టీకి మహిళా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో 14 జిల్లాలకు అధ్యక్షులకు నియమించేటప్పుడైనా మహిళలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.