calender_icon.png 5 April, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమ్దానీ పెంపునకు కొత్త బార్లు!

05-04-2025 01:16:44 AM

  1. అబ్కారీశాఖ కసరత్తు 
  2. రాష్ట్రంలో ఇప్పటికే 1,171 బార్లు 
  3. మరో 40 కొత్త బార్లకు అనుమతి ఇచ్చేందుకు చర్యలు
  4. 25 బార్లకు నోటిఫికేషన్ విడుదల
  5. ఒక్కోబార్ నుంచి ఏడాదికి రూ.40 లక్షలు వసూలు  

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుతుండగా.. అందులో సింహభాగం అబ్కారీశాఖ శాఖదే. ఒకవైపు మద్యం అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, మద్యం లైసెన్స్ ఫీజు, మద్యం దరఖాస్తుల నుంచి ఆదాయం సమకూర్చుకుంటూనే.. మరో వైపు బార్ల నుంచి కూడా పెద్దమొత్తం లో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటోంది.

రాష్ట్రంలో మొత్తం 2,620 మ ద్యం షాపులుండగా 1,171 బార్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో 40 బార్లకు అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో.. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలకు గాను 25 బార్లకు అబ్కారీశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అనంతరం హైదరాబాద్ జిల్లాలో మిగతా 15 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వనుంది.

పాత బార్లు, కొత్తవి కలిసి మొత్తం 1,211 బార్లు కానున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కో బార్ నుంచి ఏడాదికి సగటున రూ.40 లక్షల వరకు ఆదాయం సమకూరనుంది. గ్రేటర్ పరిధిలోని బార్లకు రెన్యువల్ ఫీజుతో కలిపి రూ.42 లక్షల వరకు ఉండగా, జిల్లాలో ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కో బారుకు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అబ్కారీ శాఖ వసూలు చేస్తోంది.

అంటే రాష్ట్రంలోని 1,171 బార్లకు గాను సుమారుగా రూ.468.4 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఇప్పుడు కొత్తగా మరో 40 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వడంతో అదనంగా ఈ ఏడాది నుంచి రూ.16 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్కో బారుకు ఒక్కో దరఖాస్తు కోసం రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తం దరఖాస్తుల నుంచి లాటరీ ద్వారా బార్ నిర్వాహకులను అబ్కారీ శాఖ ఎంపిక చేస్తుంది. అయితే బార్ దక్కని వారికి దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తిరిగి ఇవ్వదు. దరఖాస్తు రూపంలో వచ్చిన రుసుమును ప్రభుత్వమే తీసుకుంటుంది. 

పర్మిట్‌రూమ్‌లు ఎత్తివేయాలి.. బెల్ట్‌షాపులను కట్టడి చేయాలి.. 

వైన్స్‌షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లకు అబ్కారీ శాఖ అనుమతి ఇస్తోంది. ఒక్కో పర్మిట్ రూమ్‌కు అదనంగా ఎక్సైజ్ శాఖ  రూ.లక్ష వరకు వసూలు చేస్తోంది. అంటే రాష్ట్రంలో ఉన్న 2,620 వైన్‌షాపులు ఉండగా, వీటికి పర్మిట్ రూమ్‌లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా సర్కార్‌కు రూ.26.20 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది.

అయితే బార్ల యజమానులు మాత్రం వైన్స్‌ల వద్ద పర్మిట్‌రూమ్‌లను వ్యతిరేకిస్తున్నారు. వైన్‌షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి.. అక్కడే పర్మిట్ రూమ్ ఉండటం వల్ల బారుషాపుల వద్దకు మద్యంప్రియులు ఎక్కువగా రావడం లేదని, తద్వారా బార్లకు నష్టాలు వస్తున్నాయని ఆందోళన చేస్తున్నారు. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్, పట్టణాలు, ప్రతి గ్రామంలో గల్లిగో బెల్ట్‌షాప్ ఉండటంతో బార్లకు నష్టాలు వస్తున్నాయని బార్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి  యేటా చెల్లించాల్సిన ఫీజు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలంగాణ బార్ల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైన్‌షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లను, బెల్ట్‌షాపులను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.