- రెండు నెలల్లో అందుబాటులోకి
- మరికొన్ని సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ ౨౦ (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలో త్వరలో కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పా టు కాబోతున్నాయి. అందుకోసం మహిళా, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో కొత్త అంగన్‌వాడీ కేంద్రాలను ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. వాటికి తోడు మరిన్ని కొత్త అంగన్‌వాడీ సెంటర్లకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
చేరువలో ఉండేలా..
హైదరాబాద్ జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో ప్రస్తుతం 914 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో 842 మంది టీచర్లు, 750 మంది ఆయాలు ఉన్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులు సహా దాదాపు 1.6 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను ఐసీడీఎస్ అధికారులు గుర్తించారు.
దీంతో వారికి ప్రత్యేక పౌష్టికాహారం అందే లా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాం తాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు దూరంగా ఉండడంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి చేరువలో అంగన్‌వాడీ సెంటర్లు ఉండే విధంగా ప్రభుత్వం, ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా బస్తీ ల్లో తప్పనిసరిగా అంగన్‌వాడీ సెం టర్లు ఉం డేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. అందుకోసం కావాల్సిన భవనాలను గుర్తిస్తున్నారు.
జనాభాకు అనుగుణంగా కేంద్రాలు
జిల్లాలోని జనాభాకు అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మహిళా, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఐదు ప్రాజెక్ట్‌ల పరిధిలోని ఆసిఫ్‌నగర్ మండలంలో 7, షేక్‌పేట్ మండలంలో 4, సికింద్రా బాద్‌లో 4, ముషీరాబాద్‌లో 1, అంబర్‌పేట్‌లో 3, నాంపల్లిలో 4, సైదాబాద్‌లో 5, చార్మినార్‌లో 2, బండ్లగూడలో 7, గోల్కొండలో 2, అమీర్‌పేట్‌లో 1, ఖైరతాబాద్‌లో 5, బహదూర్‌పురా మండలంలో 6, తిరుమలగిరి మండలంలో 5 కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. వీటికి తోడు జిల్లాలోని వివిధ మండలాల్లో మరో 150 అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసి కలెక్టర్ అనుమతికి పంపించినట్లు తెలుస్తోంది. ఆయన అనుమతి రాగానే ప్రభుత్వా నికి నివేదిక పంపబోతున్నారు.