కామారెడ్డి: మోడీ పదేళ్ల కాలంలో ధనిక వర్గాలకు మాత్రమే మేలు జరిగిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. కామారెడ్డి జనజాతర సభలో ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మోడీ పదేళ్ల కాలంలో ఐదారుగురు మాత్రమే బిలియనీర్లుగా ఎదిగారని చెప్పారు. ఐదారుగురి ప్రయోజనాల కోసం మాత్రమే మోడీ పనిచేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. అత్యున్నత పదవిలో పదేళ్లు ఉన్న మోడీ ఈ దేశానికి ఏం చేశారో ఎప్పుడూ చెప్పలేదని ప్రశ్నించారు. తన బాధలు చెప్పుకున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ.. ప్రజల కష్టాలు మాత్రం వినలేదని మండిపడ్డారు. బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి గమనించాలని ఆమె ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులు, పథకాలపై మోడీ తన పొటోలు వేసుకున్నారని విమర్శించారు.