20-03-2025 11:48:32 PM
కన్నడ అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి రాజన్న..
కేంద్ర నేతలు కూడా ఉన్నారని వ్యాఖ్య...
బెంగళూరు: ఓ కర్ణాటక మంత్రిపై హనీ ట్రాప్ జరిగిందనే వార్తల నేపథ్యంలో కన్నడ అసెంబ్లీలో మంత్రి రాజన్న బాంబు పేల్చారు. 48 మంది రాజకీయ నాయకులపై హనీ ట్రాప్ జరిందని వెల్లడించారు. ‘నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ సీడీలు, పెన్‌డ్రైవ్‌లకు 48 మంది బాధితులుగా మారారు. ఏ ఒక్క పార్టీ వారో కాకుండా అన్ని పార్టీల వారు బాధితులుగా ఉన్నారు. ఈ జాబితాలో కేంద్ర నేతలు కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై హోం శాఖకు ఫిర్యాదు చేస్తా’ అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై హైలెవల్ కమిటీ వేసి విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది.
మంత్రి రాజన్న మాట్లాడుతూ.. ‘కర్ణాటకకు సీడీలు, పెన్‌డ్రైవ్‌ల ఫ్యాక్టరీ అని పిలుస్తారు. కేవలం నేను మాత్రమే ఇలా అనడం లేదు. అనేక మంది ఇలాగే పిలుస్తున్నారు. మన దగ్గర హనీ ట్రాప్ జరగడం అదీ సీడీలతో జరగడం పెద్ద విషయం. ఇప్పటికే తుమకూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రులు ఈ హనీట్రాప్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. తుమకూరు ప్రాంతం నుంచి నాతో పాటు పరమేశ్వర కూడా మంత్రిగా ఉన్నారు. హనీ ట్రాప్ గురించి అనేక వార్తలు వింటున్నాం. కానీ నేను ఇక్కడ స్పందించడం సముచితం కాదు’ అని అన్నారు.
కన్నడ సీఎం జీతం డబుల్.!
కర్ణాటక శాసనసభ్యుల వేతనాలు పెంచేందుకు ఓ బిల్లును త్వరలో సభలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే సీఎం జీతం డబుల్ అవనుంది. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి నెల జీతం రూ. 75 వేలుగా ఉండగా.. ఒక వేళ బిల్లు పాస్ అయితే రూ. 1.5 లక్షలకు చేరనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతాలు కూడా డబుల్ కానున్నాయి. వారికి అందే బెనిఫిట్లు కూడా రెండింతలు పెరగనున్నాయి.