ముగ్గురు అనుమానితుల అరెస్టు
న్యూఢిల్లీ, నవంబర్ 17: గాజా, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలోని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఇంటి సమీపంలో దుండగులు బాంబుదాడికి పాలడ్డారు. గుర్తుతెలియని దుండగులు శనివారం రాత్రి నెతన్యాహూ ఇంటిపై రెండు ఫ్లాష్ బాంబులతో దాడిచేయగా అవి ఆయన ఇంటి గార్డెన్ ఏరియాలో పేలినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఆ సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రదేశంలో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ బాంబు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టెల్అవీన్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. దాడికి సంబంధించి ముగ్గురు అనుమానితులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే గతనెలలో కూడా నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని ప్రభుత్వం తెలిపింది.