02-04-2025 12:00:00 AM
భూమి బల్లపరుపుగా వుందని వాదించే వారు ఉండవచ్చు. కాని నేపాల్‌లో పరిణామాలు చూస్తున్న వారెవరైనా, భూమి గుండ్రంగానే ఉందని ఒప్పుకొని తీరుతారు. మార్చి 28న నేపాల్ రాజధాని ఖాట్మండు వీధుల్లో హింస చెలరేగింది. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ పోలీసులతో కొట్లాటకు దిగారు. అల్లర్లలో ఇద్దరు చనిపోయారు, అనేకమంది గాయపడ్డారు.
నేపాల్‌లో తిరిగి రాచరిక పాలన కావాలని ఆ నిరసనకారులు రోడ్డెక్కారు. గత కొన్నేళ్లుగా నేపాల్‌లో రాచరిక పాలనను పునరుద్ధరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలను మీడియా ఎప్పటికప్పుడు ప్రపంచానికి అందిస్తున్నది. రాచరికం, మావోయిస్టుల తిరుగుబాటు, ప్రజాస్వామ్యం ఇవేవీ నేపాల్ పరిస్థితులను మార్చలేక పోయాయి. కోవిడ్ అనంతరం దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించాయి.
2008లో నేపాల్‌లో రాచరిక వ్యవస్థను రద్దు చేసినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ అస్థిరత్వం, ప్రభుత్వాలు వెంటవెంటనే మార డం, విపరీతంగా పెరిగిన అవినీతి, పాలనకు ఎదురవుతున్న సవాళ్లతో నేపాల్ సమాజం కునారిల్లింది. ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం కావడం, సహకార బ్యాంకు కుంభకోణంలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల పేర్లు బయటికి రావడం దేశ ప్రజలను మరింత కుంగదీశాయి.
ఈ పరిస్థితుల్లోనే జాతీయ భావనలు సమాంతరంగా ఊపందుకున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్’, ‘ఇండియా ఫస్ట్’ భావనలు అక్కడి జాతీయ భావనలకు ఊపిరులూదాయి. అయితే ఈ జాతీయ భావన దేశంలో రాచరిక వ్యవస్థ పునరుద్ధరణతోనే సాధ్యమని భావిస్తున్న వర్గం పుట్టుకొచ్చింది. నేపాల్ సార్వభౌమాధికారానికి పొరుగు దేశాలు ఇచ్చిన గౌరవం రాచరిక వ్యవస్థలోనే బాగుండేదని వీరి వాదన.
హిందూ జాతీయవాదం మరో కోణంగా ఉంది. హిందూ దేశంగా నేపాల్ తిరిగి గౌర వాన్ని నిలబెట్టుకుంటుందని వీరు భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్‌ను మాజీ రాజు జ్ఞానేంద్ర ప్రోది చేస్తున్నారు. ఆయన ఇటీవల భారత్‌లోని బీజేపీ నాయకులను కలిసారు. నేపాల్‌లో జరిగిన నిరసన ర్యాలీల్లో ప్లకార్డులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు కూడా కనిపించాయి.
నేపాల్‌లో హిందూ అస్తిత్వం రాచరిక పాలన పునరుద్ధరణతోనే సాధ్యమన్న భావన బలపడింది. అయితే రాచరిక పాలనను తిరిగి తెచ్చుకునేందుకు నేపాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారా అంటే, అదీ అనుమానమే. 2001లో రాజ ప్రాసాదంలో అప్పటి రాజు బీరేంద్ర కుటుంబంలో జరిగిన మారణహోమం స్మృతిపథంలోనే ఉంది. అప్పుడే రాచరిక పాలనపై నేపాల్‌కు ఆశలు సన్నగిల్లాయి.
2005లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు జ్ఞానేంద్ర నిర్ణయించడం, మీడియాపై ఉక్కుపాదం మోపడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం, చైనాతో అంటకాగడం అంతర్జాతీయంగా నేపాల్‌ను ఒంటరి చేశాయి.
వివిధ రాజకీయ వర్గాల మధ్య నేపాల్ భవిష్యత్‌పై ఏకాభిప్రాయం మృగ్యం కావడం అసలు సమస్య. పాత రాచరిక పాలనను తిరిగి నేపాల్ తెచ్చుకున్నా దానికి చైనా, భారత్, యూరొపియన్ యూనియన్, అమెరికా మద్దతు మృగ్యమే కావచ్చు.