చిట్యాలలో 4వేల ఏళ్లనాటి రాతిగొడ్డలి లభ్యం
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో క్రీ.పూ. 4వేల సంవత్సరాల నాటి అరుదైన ఆనవాళ్లు లభించాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీ ఇండియా సీఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. పురాతన వారసత్వ సంపదను గుర్తించి, కాపాడాలని గ్రామస్తులకు అవగాహన కల్పించే “ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ” కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం గుండ్రాంపల్లి, ఏపూరు గ్రామాల మధ్యలో నాగులకట్ట వద్ద చేపట్టిన అన్వేషణలో 15 సెం.మీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంగల నల్ల సానపు రాతిగొడ్డలి కనిపించిందని చెప్పారు. నాగులకట్టపైన కాకతీయుల కాలానికి చెందిన క్రీ.శ. 13వ శతాబ్దం నాటి నాగదేవతల శిల్పాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వారసత్వ కార్యకర్త యడ్లపల్లి అమర్నాథ్ పాల్గొన్నారు.