calender_icon.png 20 November, 2024 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాయాదుల పోరు

09-06-2024 12:35:50 AM

నేడు పాకిస్థాన్‌తో టీమిండియా ఢీ  రాత్రి 8 గంటలకు మ్యాచ్

న్యూయార్క్:  ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. న్యూయార్క్ వేదికగా నసావు కౌంటీ స్టేడియంలో టీమిండియా, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి. ఆదివారం జరగనున్న ఈ బిగ్‌ఫైట్‌కు స్టేడియం పూర్తి స్థాయిలో నిండనుంది. అశేష ప్రేక్షకుల సమక్షంలో చిరకాల ప్రత్యర్థుల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం. ప్రస్తుతానికి మ్యాచ్‌లో రోహిత్ సేన ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం మెగాటోర్నీని ఓటమితో ప్రారంభించింది. అమెరికాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ సేన సూపర్ ఓవర్‌లో పరాజయం పాలై తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్.. టీమిండియాతో మ్యాచ్‌లో చెలరేగే అవకాశముంది. దీంతో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

బ్యాటింగ్ బలమెంత?

ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియాకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే ఐర్లాండ్ విధించిన లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిసి తన ఫామ్‌ను చాటి చెప్పాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ చెలరేగాలని ఆశిద్దాం.  ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. అయితే కోహ్లీ ఫామ్‌పై ఆందోళన అనవసరం. మెగాటోర్నీల్లో ఘనమైన రికార్డు కలిగిన కోహ్లీ చాలాసార్లు తొలి మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికి ఆ తర్వాత ఫుంజుకొని టాప్ స్కోరర్‌గా నిలిచిన దాఖలాలు కోకొల్లలు.  పాక్‌తో మ్యాచ్ అంటే చాలు చెలరేగిపోయే కోహ్లీ మరోసారి దాయాదిపై భారీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నాడు.

ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ .. పాక్‌తో మ్యాచ్‌లో ఓపెనింగ్ చేస్తాడా లేక వన్‌డౌన్‌లో వస్తాడా అనేది వేచి చూడాలి. ఇక రోడ్డు ప్రమాదం తర్వాత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. భారీ షాట్లను యథేచ్చగా ఆడుతూ మునుపటి పంత్‌లా కనిపిస్తున్నాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 36 పరుగులతో అజేయంగా నిలిచిన పంత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక టీ20 ప్రపంచ నెంబర్‌వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు హిట్టర్ శివమ్ దూబేలు మిడిలార్డర్ బాధ్యత తీసుకోనున్నారు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు రాణించాల్సిన అవసరముంది. ఐపీఎల్లో విఫలమైనప్పటికీ టీమిండియా జెర్సీ ధరించగానే ఎక్కడ లేని ఉత్సాహం చూపించే పాండ్యా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో వికెట్లతో చెలరేగిపోయాడు.

బ్యాటింగ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించాలని కోరుకుందాం. బౌలింగ్ విభాగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా పోయింది. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా పెద్దన్న పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. బుమ్రా సారథ్యంలో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లు తమ పదునైన పేస్ బంతులతో పాకిస్థాన్ పని పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సూపర్ స్పెల్‌తో మెరిశాడు. ఇక ఆల్‌రౌండ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రాణించడం సానుకూలాంశం. నసావు కౌంటీ పిచ్ పేసర్లకు స్వర్గధామంగా నిలుస్తుండడంతో భారత్.. పాక్‌తో మ్యాచ్‌లో మరోసారి ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ఆల్‌రౌండర్ కోటాలో జడేజా ఉండడంతో ప్రధాన స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్‌లో ఎవరు ఒకరికి అవకాశం లభించనుంది. 

ఒత్తిడిలో బాబర్ సేన..

గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్ పసికూన అమెరికా చేతిలో చిత్తవ్వడం సహజంగానే వారిపై ఒత్తిడి పెంచింది. అయితే అనిశ్చితి ఆటకు మారుపేరైన పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి బాబర్ ఆజమ్ సేనను తక్కువ అంచనా వేయలేం. బౌలర్లకు సహకరిస్తున్న నసావు కౌంటీ పిచ్‌పై పాకిస్థాన్ బౌలర్లు చెలరేగే అవకాశముంది. షాహిన్ అఫ్రిది, మొహమ్మద్ ఆమిర్, నసీమ్ షా, హారిస్ రవూఫ్ రూపంలో ఆ జట్టుకు ప్రమాదకర పేసర్లు ఉన్నారు. బ్యాటింగ్ విభాగం ఎలా ఉన్నా వారి బౌలింగ్ లైనప్ మాత్రం ఎప్పుడూ పటిష్టంగానే ఉంటుంది. అమెరికాతో మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లు పెద్దగా ప్రభావం చూపని పాక్ బౌలర్లు ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం చూశాం.

దీన్నిబట్టి పాక్ బౌలర్లు టీమిండియాతో మ్యాచ్‌లో ప్రభావం చూపే అవకాశముంది. ఇక బ్యాటింగ్‌లో మాత్రం పాకిస్థాన్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫామ్‌లో ఉన్నప్పటికీ మిగతా బ్యాటర్లు రాణించడం లేదు. మహ్మద్ రిజ్వాన్ పేలవ ఫామ్ కంటిన్యూ చేస్తుండగా.. ఉస్మాన్ ఖాన్, ఆజం ఖాన్‌లు తరచూ విఫలమవుతున్నారు. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ మరోసారి కీలకమయ్యే అవకాశముంది. హిట్టర్ పాత్రలో మెరుపులు మెరిపించేందుకు ఆల్‌రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ సిద్దంగా ఉన్నాడు.

మొత్తానికి టీమిండియా బ్యాటింగ్‌కు.. పాకిస్థాన్ బౌలింగ్‌కు పోటీగా కనిపిస్తున్న మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఆసక్తికరం. ఇరుజట్లు టీ20 ప్రపంచకప్పుల్లో ఏడుసార్లు తలపడగా.. టీమిండియా 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా.. పాకిస్థాన్ కేవలం ఒక్కసారి మాత్రమే నెగ్గింది. 2021 టీ20 ప్రపంచకప్‌లో మాత్రమే టీమిండియా పాకిస్తాన్ చేతిలో పరాజయం చూసింది. ఇది మినహా ఐసీసీ అన్ని టోర్నీల్లోనూ పాక్‌పై భారత్‌దే స్పష్టమైన ఆధిపత్యం.

పాక్‌తో మ్యాచ్ అంటే పూనకమే..

పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే చాలు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి ఎక్కడలేని పూనకం వస్తోంది. పొట్టి ప్రపంచకప్‌లో కోహ్లీకి పాక్‌పై ఘనమైన రికార్డు ఉంది. టీ20 ప్రపంచకప్పుల్లో కోహ్లీ పాక్‌పై  132.75 స్ట్రయిక్‌రేట్‌తో 308 సగటుతో 308 పరుగులు సాధించడం విశేషం. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. 2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ విలువ కట్టలేనిది. పాకిస్థాన్ బౌలర్ల నుంచి బులెట్స్‌లా దూసుకొస్తున్న బంతులను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండీరీలు, సిక్సర్ల వర్షం కురిపించి అజేయ అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోసారి చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ జరుగుతున్న తరుణంలో కోహ్లీ మరోసారి రెచ్చిపోవాలని ఆశిద్దాం. కోహ్లీ ఒక్కడే కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు దాయాది పాకిస్థాన్ జట్టుపై మంచి రికార్డు కలిగి ఉన్నారు.  కోహ్లీతో పాటు రోహిత్, పాండ్యాలు మెరిస్తే టీమిండియా పాక్‌పై విజయం నల్లేరు మీద నడకే కానుంది.