17-12-2024 12:00:00 AM
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అప్పట్లో పలువురు ప్రముఖులకు రాసిన లేఖల వ్యవహారంపై తాజాగా వివాదం రాజుకుంది. సోనియా గాంధీ గతంలో తీసుకెళ్లిన ఈ లేఖలను, కొన్ని పత్రాలను తిరిగి ఇచ్చేయాలంటూ ప్రధాన మంత్రి సంగ్రహాలయ(ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ)కి చెందిన సభ్యుడొకరు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి తాజాగా లేఖ రాయడం ఈ వివాదానికి కారణమయింది. వాటిని 2008 యూపీఏ పాలనలో అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అప్పటి మ్యూజియం డైరెక్టర్ అనుమతితోనే తీసుకెళ్లారు.
అయితే వాటిని ఇప్పుడు తిరిగి ఇచ్చేయాలని మ్యూజియం సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి రాహుల్‌కు లేఖ రాశారు. ఈ లేఖల విషయమై తాను గతంలోనే సోనియాకు లేఖ రాశానని, అయితే ఆమెనుంచి స్పందన రాకపోవడంతో తిరిగి లేఖ రాస్తున్నట్లు రిజ్వాన్ ఆ లేఖలో పేర్కొన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఎడ్వినా మౌంట్‌బాటెన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, విజయలక్ష్మీపండిట్ , అరుణా అసఫ్ అలీ, జగజ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖుల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు వీటిలో ఉన్నాయి.
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ లేఖలను జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. అయితే 2008లో 51 బాక్సుల్లో ప్యాక్ చేసిన వాటిని సోనియాగాంధీకి పంపారు. అప్పటినుంచీ అవి సోనియా వద్దే ఉన్నాయి. నెహ్రూ 16 ఏళ్ల పాటు నివసించిన తీన్‌మూర్తి భవన్‌లోనే నెహ్రూ మెమోరియల్ మ్యూజియం ఉండేది. అయితే రెండేళ్ల క్రితం దీన్ని ప్రధానమంత్రుల జ్ఞాపకాలతో కూడిన మ్యూజియంగా మార్చాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
మిగతా లేఖల విషయం అటుంచితే చిట్టచివరి బ్రిటీష్ గవర్నర్ జనరల్‌గా పని చేసిన లార్డ్ మౌంట్‌బాటన్ సతీమణి ఎడ్వినాకు నెహ్రూ రాసిన లేఖలపైనే ప్రధానంగా ఇప్పడు వివాదం కొనసాగుతోంది. ఎడ్వినా మౌంట్‌బాటన్, నెహ్రూల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని గతంలో చాలా కథనాలు వచ్చాయి కూడా. అందుకే ఈ లేఖలను రహస్యంగా ఉంచాలని సోనియా అనుకొంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
వారి లేఖల్లో అంత రహస్యం ఏముందని బీజేపీ ప్రతినిధి సందీప్ పాత్ర ప్రశ్నిస్తున్నారు. అయితే 80 ఏళ్ల కింద నెహ్రూ రాసిన ఈ లేఖల వ్యవహారాన్ని బీజేపీ ఇప్పుడే ఎందుకు లేవనెత్తుతోందనేదే ప్రశ్న. ఎడ్వినాకు నెహ్రూ రాసిన లేఖలు ఇప్పడు ఎవరికీ అందుబాటులో లేవు. అయితే ఎడ్వినా కుమార్తె పమేలా హిక్స్‌లాంటి ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆ లేఖల్లో కొన్నిటిని చూశారు.
ఆ విషయాన్ని పమేలా ‘డాటర్ ఆఫ్ ఎంపైర్: లైఫ్ యాజ్ మౌంట్‌బాటన్’ పేరిట రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. తన తల్లి, నెహ్రూల మధ్య లోతయిన అనురాగం ఉందని, వారిద్దరూ ఒకరినొకరు ఎంతగా గౌరవించుకునే వారో తనకు ఆ లేఖల ద్వారా అర్థమయిందని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే వారిద్దరి మధ్య భౌతిక సంబంధం లేదనేది వాస్తవమని కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
భద్రపరచడం కోసం నెహ్రూ లేఖలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మ్యూజియంకు ఇచ్చారని ఖాద్రి రాహుల్‌కు రాసిన లేఖలో పేర్కొంటూ, భారత చరిత్రలో కీలక ఘట్టానికి సంబంధించిన అత్యంత విలువైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని, అందుకే వాటిని తిరిగి అప్పగించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అయితే మొత్తం వ్యవహారంపై పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఇవి వ్యక్తిగత హోదాలో నెహ్రూ ఆయా వ్యక్తులకు రాసినవని, వాటిని బహిర్గతం చేయడమంటే ఇప్పుడు లోకంలో లేని ఓ వ్యక్తి గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని కొందరు వాదిస్తున్నారు. అయితే దేశం స్వాతంత్య్రం పొందిన సమయంలో ఘటనలు, దౌత్య వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి వీటిని బహిర్గతం చేయాలని మరికొందరు అంటున్నారు. ప్రతిదీ వివాదం అవుతున్న నేటి రాజకీయాల నేపథ్యంలో 80 ఏళ్ల నాటి లేఖలు కూడా ఓ రాజకీయ అంశంగా మారడం సబబా అనేదే ప్రశ్న.