calender_icon.png 26 April, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెహ్రూనే స్ఫూర్తి

26-04-2025 01:18:26 AM

భారత్ సమ్మిట్ నిర్వహణ తెలంగాణకు గర్వకారణం

  1. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలే ఆదర్శం 
  2. గ్లోబల్ జస్టిస్ మా ఆకాంక్ష: డిప్యూటీ సీఎం భట్టి
  3. అర్థవంతమైన చర్చ కోసమే సమ్మిట్: మంత్ర ఉత్తమ్ 
  4. అన్నిరంగాల్లో మహిళలకు ప్రాతినిథ్యం పెరగాలి: మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్
  5. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో గ్లోబల్ సమ్మిట్‌కు అంకురార్పణ
  6. 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధుల ప్రాతినిధ్యం

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు రెండు కూటములుగా విడిపోయి ప్రచ్ఛన్నయుద్ధం నెలకొన్న వేళ నాటి ప్రధాని నెహ్రూ అలీనోద్యమానికి బాటలు వేశారని, అదే స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నదని, ఈ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆకాంక్షించారు.

హైదరాబాద్ హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్సన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) నోవాటెల్‌లో శుక్రవారం  కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ‘భారత్ సమ్మిట్’కు జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను ఆధారం చేసుకుని తమ ప్రభుత్వం సమ్మిట్ నిర్వహిస్తు న్న దని, సమ్మిట్‌కు అంతర్జాతీయ శాంతికాముకులు, ప్రగతివాద మేధావులు ప్రాతినిథ్యం వహించడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు.

ప్రస్తుతం యావత్ ప్రపంచ మానవాళి ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను ఎదు ర్కొంటున్నదని, ఇలాంటి సందర్భంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సమ్మిట్ ఆలోచన చేశారని తెలిపారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, సామాజిక న్యాయం అనే అంశాలను మరొక్కసారి ప్రపంచానికి చాటిచెప్పాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆ మూడు సూత్రాల స్ఫూర్తితోనే తమ ప్రభు త్వం తెలంగాణలో పాలన సాగిస్తున్నదని వివరించారు. 

పక్కా ప్రణాళికతో అభివృద్ధి..

పక్కా ప్రణాళికతో రాష్ట్రప్రభుత్వం కీలకమైన ప్రాజెక్టులు చేపట్టబోతున్నదని డిప్యూటీ సీఎం ఉద్ఘాటించారు. క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్ప త్తి సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య క్లస్టర్స్ నెలకొల్పుతామని వివరించారు.

మూసీ పునర్జీవంతో హైదరాబాద్‌ను సుందరీకరిస్తామని వివరించారు. ఫ్యూచర్ సిటీ,  నాలెడ్జ్ ఐటీ సెంటర్,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు. ఇందిరా గిరి జల వికాసం,  రాజీవ్ యువ వికాసం పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు.

అర్థవంతమైన చర్చలు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దేశ విదేశాల ప్రతినిధులు గ్లోబల్ జస్టిస్, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అర్థవంతమైన చర్చ లేవనెత్తారని, తద్వారా భారత్ సమ్మిట్ నిర్వహణ ఫలప్రదమవుతున్నదని భావిస్తున్నామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. హైఐసీసీ ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సమ్మిట్ ద్వారా తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో రోల్‌మోడల్‌గా రుజువు చేసుకునే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.

సదస్సుకు సుమారు 100కుపైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారని వెల్లడించారు. అనంతరం పహల్గాంలో ఉగ్ర మూకల దాడిపై మంత్రి స్పందిస్తూ.. ఉగ్రవాదుల కుట్రలను యావత్ భారతదేశం తిప్పికొట్టాల్సిన తరుణం వచ్చిందన్నారు. కశ్మీర్ గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని, హిందూ -ముస్లిలల మధ వైషమ్యాలు సృష్టించేందుకే ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అభిప్రాయపడ్డారు.

విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం

నగరంలోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి విచ్చేసిన 450 ప్రతినిధులకు ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. మహిళలు బోనాలు ఎత్తుకుని, కళాకారులు డప్పు చప్పుళ్లతో సందడి చేశారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సమ్మిట్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హాజరు కాలేదు. రెండో రోజు శనివారమైనా హాజరవుతారో లేదో? అనే అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

అన్నిరంగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండాలి: మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్

మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఉండాలని, ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్న రంగాల్లో మరింత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. నోవాటెల్‌లో తొలిరోజు శుక్రవారం ‘లింగ న్యాయం స్త్రీవాద భవిష్యత్ ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు వివిధ విభాగాల్లో టాప్ స్థాయిలో ఉన్నారని కొనియాడారు. 

ఇతర ప్రతినిధులూ..

సదస్సులో సోలాపూర్ ఎంపీ ప్రణితీ షిండే ప్రసంగిస్తూ.. లింగ సమానత్వం, మహిళా సాధికారితపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగోలియా ఎంపీ ఉండ్రాణ్ చిన్‌బాట్ ప్రసంగిస్తూ.. తమ దేశ పార్లమెంట్‌కు 25 శాతం మంది మహిళలే ప్రాతినిధ్యం వహిస్తారని, భారత్‌లోనూ అలాంటి రోజు రావాలని ఆకాంక్షించారు. స్వీడన్ విదేశాంగ మాజీ మంత్రి అన్‌లిండే ప్రసంగిస్తూ.. ప్రపంచస్థాయి శాంతి చర్చల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అభిప్రాయపడ్డారు.

అర్జెంటీనా సోషలిస్టు పార్టీ నాయకురాలు మోనికా హేడీ ఫీన్ ప్రసంగిస్తూ.. ప్రాథమిక విద్యస్థాయిలోనే విద్యార్థులకు లైంగిక విద్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నదని, వారి ఆర్థిక స్వావలంబన కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు.

పహల్గాం మృతులకు నివాళి..

జమ్మూకశ్మీర్‌లోనిపహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన వారికి నివాళిగా భారత్‌సమ్మిట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శనగా కదిలారు. ఉగ్రవాద దాడిపై దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడి ప్రజల ఐక్యత, శాంతి, సామరస్యం, రాజ్యాంగ విలువలపై చేసిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు.

నేను కూడా డీప్ ఫేక్ బాధితుడినే..

మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ 

దేశంలో డిజిటల్ మానిప్యులేషన్ దారుణంగా ఉందని, తాను కూడా డీప్ ఫేక్ బాధితుడినే అని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని హెచ్‌సీఐసీలోని నోవాటెల్‌లో ‘వాస్తవం కల్పన’ అనే అంశంపై నిర్వ హించిన ప్యానల్ సమావేశంలో ఆ యన మాట్లాడారు.

సోషల్‌మీడియా ప్రచారంతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఇతర ప్రతినిధులు థానిసార రువాంగ్ దేజ్, మియాపెట్రా కుంపుల నత్రి, యూకే లేబర్ పార్టీ నేత మాథ్యూ విలియం ఫాల్డిండ్ తదితరులు ప్రసంగించారు. ప్యానెల్‌లో మంత్రి పొంగులేటి  శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.