calender_icon.png 21 September, 2024 | 8:21 AM

మమతతో చర్చలు విఫలం

15-09-2024 12:14:19 AM

లైవ్‌కు అంగీకరించకపోవడంతో జూడాల వ్యతిరేకత

కోల్‌కతా, సెప్టెంబర్ 14: బెంగాల్ ప్రభుత్వం, వైద్య విద్యార్థుల మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన వీడటం లేదు. శనివారం నేరుగా సీఎం మమతా బెనర్జీ వెళ్లి  జూడాలను సముదాయించిన తర్వాత చర్చ లకు వైద్యులు అంగీకరించారు. ఇందుకోసం మమత నివాసానికి వెళ్లారు. కానీ, చర్చల లైవ్ టెలికాస్ట్‌కు ప్రభుత్వం ఒప్పుకోకపోవ డంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. ఇంకా తనను అవమానించవద్దని ఈ సందర్భంగా దీదీ వైద్యులతో అన్నారు. అంతకుముందు వైద్యులను బుజ్జగించేందుకు ఆర్జీకర్ కాలేజీకి మమత వెళ్లారు.

వారితో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా రాలేదని, మీలో ఓ సోదరిగా వచ్చానని చెప్పారు. నా పదవికి కన్నా ప్రజలే పెద్దలనీ పేర్కొన్నారు. మీ డిమాండ్లు అన్నింటినీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సంక్షేమ కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంక్షోభాన్ని పరిష్క రించేందుకు ఇదే తన చివరి ప్రయత్నమని పేర్కొన్నారు. మమత నేరుగా మాట్లాడిన తర్వాత చర్చలకు సిద్ధమేనట్టు వైద్యులు ప్రభుత్వానికి మెయిల్ పంపగా విద్యార్థులు అక్కడికి వెళ్లారు. 

మాజీ ప్రిన్సిపాల్ అరెస్ట్  

జూడా హత్యాచారం కేసులో ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో పోలీస్ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడం, సాక్ష్యాధారాలను దాచేందుకు యత్నించారన్న అభియోగాలపై వీరిని అదుపులోకి తీసుకుంది.