calender_icon.png 24 October, 2024 | 2:17 AM

యూనివర్సిటీలపై నిర్లక్ష్యమేల?

09-08-2024 01:20:10 AM

బడ్జెట్ కేటాయింపుల్లో ఎప్పుడూ మొండిచెయ్యే

ఏ ఏడాది రూ.వెయ్యి కోట్లు కూడా దాటని ప్రతిపాదనలు

అవి నిర్వహణకే సరిపోతుంటే వసతుల కల్పన మాటేమిటి?

అరకొర నిధులతో నాణ్యమైన విద్య, పరిశోధనలు సాధ్యమయ్యేనా!

హైదరాబాద్, ఆగస్టు ౮ (విజయక్రాంతి): రాష్ట్రంలోని యూనివర్సిటీలకు బడ్జెట్‌లో ఎప్పుడూ మొండి చెయ్యి చూపిస్తున్నారు. ఎన్ని పద్దులు వచ్చినా వర్సిటీలపై పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా ఈ పరిస్థితి మారాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని 11 వర్సిటీలకు కలిపి 2024 బడ్జెట్‌లో కనీసం వెయ్యి కోట్లు కూడా కేటాయించకపోవడంతో విశ్వవిద్యాలయాలపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ నిధులు నిర్వహణకే సరిపోతున్నాయి. అభివృద్ధి పనులకు ఏమాత్రం చాలడంలేదు. ఒకవైపు అరకొర నిధుల కేటాయింపులు, మరోవైపు ఫ్యాకల్టీ కొరత వెరసి పరిశోధనలకు వేదికలుగా ఉండాల్సిన యూనివర్సి టీలు సమస్యలకు నిలయాలుగా, ఆందోళనలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఒకప్పు డు యూనివర్సిటీ క్యాంపస్ సీటు కోసం తీవ్ర పోటీ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సీటు వచ్చినా అందులో జాయిన్ అవ్వాలా? వద్దా? అని విద్యార్థులు ఆలోచిస్తున్నారు.

వెయ్యి కోట్లు దాటలే!

యూనివర్సిటీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఎప్పుడూ కనీసం రూ.వెయ్యి కోట్లు కూడా దాటడంలేదు. ఒక్కో ఏడాది అయితే కేటాయించే బడ్జెట్ ప్రొఫెసర్లు, ఉద్యోగులు జీతభత్యాలకూ సరిపోవడంలేదనే విమర్శలున్నాయి. బడ్జెట్‌లో నిర్వహణకు అధికంగా కేటాయించి, అభివృద్ధికి నామమా త్రంగా కేటాయిస్తూ వస్తున్నారు. 2020 బడ్జెట్‌ను పరిశీలిస్తే రూ.536.36 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ కోసం ఇచ్చింది రూ.533.36 కోట్లు అయితే, మిగతా రూ.3 కోట్లు మాత్రం ప్రగతి పద్దు కింద ఇచ్చారు.

అదే 2019 ఏడాదికి ఇంకా తక్కువగా నిర్వహణ కోసం రూ.480.52 కోట్లు కేటాయించారు. ఈ నిధులు ప్రొఫెసర్లు, సిబ్బంది జీతాలకే సరిపోయే పరిస్థితి. ఒక్కో వర్సిటీ తమకు సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.600 కోట్లు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నా గత, ప్రస్తుత ప్రభుత్వాలు అరకొరగానే కేటాయిస్తూ వస్తున్నాయి. దీంతో వర్సిటీల ప్రతిష్ఠ మసకబారుతోంది. వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కూడా న్యాక్ గుర్తింపులో వెనుకబడుతోంది. ఏటా జాతీయ స్థాయిలోని విశ్వవిద్యాలయాలకు ప్రకటించే ర్యాంకుల్లో మన యూనివర్సిటీలు దిగజారుతున్నాయి.

నిర్వహణ పద్దుకు.. 

రాష్ట్రంలోని వర్శిటీల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నిర్వహణ పద్దు కింద 956.34 కోట్లను ప్రతిపాదించారు. ఉస్మానియాకు రూ.492 కోట్లు, కాకతీయకు రూ.134.94 కోట్లు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూ.17.95 కోట్లు, తెలంగాణ వర్సిటీ రూ.42.09 కోట్లు, తెలుగు వర్సిటీ రూ.43.37 కోట్లు, మహాత్మాగాంధీ వర్సిటీ రూ.30.77 కోట్లు, శాతవాహన వర్సిటీ రూ.14.31 కోట్లు, పాలమూరు వర్సిటీ రూ.11.74 కోట్లు, జేఎన్‌ఏ ఫైన్ ఆర్ట్స్‌కు రూ.28.75 కోట్లు, జేఎన్టీయూకు రూ.52.69 కోట్లు, ఆర్జీయూకేటీకి రూ.35.64 కోట్లు కేటాయించారు.

ఎప్పుడూ ఇంతే!

విశ్వవిద్యాలయాల్లో మౌలికవసతు లు, హాస్టల్ భవనాలు సరిపడా లేవు. మైనర్ రిపేర్లు చేసేందుకు, అభివృద్ధి పనులకు నిధులు ఉండని పరిస్థితి నెలకొంది. 2017 రూ.420 కోట్లు, 2018 19లో రూ.210 కోట్లు, 2023 రూ.500 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది 12 వర్సిటీలకు రూ.500 కోట్లు అభివృద్ధికి కేటాయించారు. ఇందులో ఉస్మానియా, మహిళా యూనివర్సిటీకి రూ.100 కోట్లు చొప్పున కేటాయించగా, మిగిలిన రూ.300 కోట్లు పది వర్సిటీలకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఈ నిధుల్లో ఎంతవరకూ విడుదల చేస్తారనేది చూడాల్సి ఉంది. 2023 బడ్జెట్‌లో 11 విశ్వవిద్యాలయాల్లో వేతనాలకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 835.94 కోట్లు ప్రతిపాదించి, రూ. 784.64 కోట్లే విడుదల చేసింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో నిర్వహణ పద్దు కింద రూ.956.34 కోట్లు కేటాయించారు.