- లంగర్ హౌస్‌లో అడ్డగోలుగా పనులు
- సీసీ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం
- భారీ వరద నీరు పోవడానికి గతంలో లక్షల రూపాయలతో పనులు
- ప్రస్తుతం దానిని మూసేసి రోడ్డు నిర్మాణం
- వర్షా కాలంలో వాహనాలు వెళ్లలేని దుస్థితి
రాజేంద్రనగర్( కార్వాన్) జనవరి 19: జిహెచ్‌ఎంసి అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్లకు వరంగా మారుతోందని విమర్శలు వెల్లి వెత్తుతున్నాయి. జనం సొమ్ము కదా అని యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టర్లకు కమిషన్ వస్తే చాలు కదా అనే మాదిరిగా అధికారుల తీరు కనిపిస్తోంది. లంగర్ హౌస్ లోని ప్రధాన రహదారి వద్ద జి షాన్ హోటల్ సమీపంలో ఎగువ ప్రాంతంలో వర్షాకాలంలో భారీగా వరద నీరు వస్తుంటుంది.
అయితే ఇక్కడ గతంలో మ్యాన్ హోల్ ఉండేది. కొన్ని రోజుల క్రితం లక్షల రూపాయలతో దానిని నిర్మించారు. చాలా రోజులపాటు రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగింది. అయితే ఇటీవల నూతనంగా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. భారీ వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాకాలంలో వాహనాలు కూడా రోడ్డుపై నుంచి వెళ్లలేని దుస్థితి నెలకొంటుంది.
దీనిపై జిహెచ్‌ఎంసి అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల లక్షల రూపాయలు ఖర్చుపెట్టి సీసీ రోడ్డు నిర్మించి నీరు వెళ్లేందుకు మాత్రం ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం.
తిరిగి నీరు వెళ్లేందుకు సిసి రోడ్డును తవ్వి ఏర్పాట్లు చేయాల్సిందే. ఇలా ప్రజాధనం వృధా అవుతున్నా జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమ ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రిల్స్ మాదిరిగా ఏర్పాట్లు చేస్తే మేలు
జిశాన్‌హోటల్ సమీపంలో ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు వస్తుంటుంది. ఇక్కడ గ్రిల్స్ మాదిరిగా నీరు వెళ్లేందుకు మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ దిశగా జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. సమస్య తలెత్తినప్పుడు తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
లంగర్‌హౌస్‌లోని సమస్యపై కార్వాన్ సర్కిల్ ఇంజనీరింగ్ ఈఈ వెంకటశేష య్యను వివరణ కోరగా.. పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.