29-03-2025 01:21:38 AM
కోనరావుపేట, మార్చి 28: వరి పంటకు సాగునీరు అందించేందుకు రాత్రిపూట వెళ్లిన రైతుకు తేలు కుట్టడంతో వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే వైద్య సిబ్బంది తలుపులు తీయకపోవడంతో బాధితున్నీ సిరిసిల్లకు తరలించిన ఘటన కోనరావుపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పని గంగారం అనే రైతు తన వరి పంటకు సాగునీరు అందించేందుకు పొలం వద్దకు వెళ్లాడు.
పంటకు నీరు అందించే సమయంలో తేలు కుట్టడంతో అంబులెన్స్ కు సమాచారం అందించడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అప్పటికే ఆసుపత్రికి తలుపులు మూసి సిబ్బంది లోపల ఉన్నారు.
అంబులెన్స్ సిబ్బంది, బాధితుని బంధువులు వైద్య సిబ్బందిని ఎంత పిలిచిన ఆస్పత్రి తలుపులు తీయకపోవడంతో, 15 నిమిషాల వరకు వేచి ఉన్నప్పటికీ సిబ్బంది స్పందించకపోవడంతో అంబులెన్స్ లో గంగారం ను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నాడు.
కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, సిబ్బంది ఇలా ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం అందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే స్థానం లో ప్రాణాపాయ స్థితిలో ఉండి ఉంటే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.