23-02-2025 11:23:27 PM
బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడం కారణంగానే కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు విమర్శించారు. రాష్ట్రంలో గ్యాస్ డెలివరీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఐదవ మహాసభలు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు మాట్లాడుతూ... కార్మిక చట్టాలు అమలు చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసారని విమర్శించారు.
కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్లు అత్యధికంగా బలహీనవర్గాల నుంచి వచ్చిన వారు అయినందువల్లే ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్రకులాలకు ఉపయోగపడే ఏ చట్టాలైన ఆగమేఘాల మీద అమలు చేస్తారని ద్వజమెత్తారు. ప్రముఖ ప్రజా ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కార్మికుల హక్కుల కోసం అడుక్కోవడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కార్మికుల పాత్ర కీలకమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్ల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు, యూనియన్ సలహాదారులు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కెవి గౌడ్, ఉద్యమకారుడు మంగిళిపల్లి శంకర్, బహుజన ప్రజాశక్తి కన్వీనర్ నల్ల లక్ష్మణ్, యూనియన్ ప్రధాన కార్యదర్శి బుర్ర చంద్రయ్య గౌడ్, ఉపాధ్యక్షులు ఎండి యునుస్, కోశాధికారి రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్, అజయ్ రెడ్డి, నర్సింగ్, రాజేష్, రాకేష్, రాజశేఖర్, రంజిత్, సుధాకర్, సోషల్ జస్టిస్ పార్టీ నాయకులు అనిల్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.