కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలి
అధికారులకు ఎంపీ మల్లు రవి సూచన
వనపర్తి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష యోజన, అటల్ బీమా యోజన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని దిశ చైర్ పర్సన్, ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం కలెక్టరేట్‌లో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. బ్యాంకర్ల ద్వారా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి లక్ష్య సాధనపై సమీక్ష నిర్వహించారు. ఎంతో మేలు చేసే కేంద్ర పథకాలను ప్రజలకు చేరవేయడంలో బ్యాంకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయని ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముద్ర రుణాలు, టర్మ్‌లోన్, ప్రయారిటి సెక్టార్, నాన్ ప్రయారిటీ సెక్టార్ వారిగా ఇవ్వాల్సిన రుణాలు సైతం నిర్దేశించిన లక్ష్యాలు సాధించలేదన్నారు. పంట రుణాలు సైతం లక్ష్యం మేరకు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
వచ్చే దిశ సమావేశం నాటికి ప్రజలకు అవగాహన కల్పించి, లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్థన్‌రెడ్డి, మైనారిటీ బోర్డు చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు.