ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 17: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అందే విధంగా ప్రతి అధికారి చర్యలు తీసుకోవాలని... ఎక్కడ నిర్లక్ష్యం వహించిన సహించేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ సర్వసభ చివరి సమావేశం ఎస్‌ఎన్‌ఆర్ కళాలో ఏర్పాటు చేశారు.
సమావేశానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పండుగల జయశ్రీ అధ్యక్షత వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎజెండా అంశాలపై చర్చించి ప్రతి వార్డు రూ.50లక్షల చొప్పున 24 వార్డులకు అభివృద్ది పనులకు కేటాయించారు.
అదే విధంగా తట్టి అన్నారంలో 16 కాలనీలకు సంబంధించిన మురుగు నీటి కోసం ట్రంక్ లైన్ నిర్మాణానికి రూ. 10 కోట్లు, పెద్ద అంబర్‌పేట్ నుంచి పసుమాముల వరకు గతంలో మంజూరు చేసిన ట్రంక్‌లైన్ నిర్మాణం చేపట్టుటకు రూ.6 కోట్లు, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్‌లో విలీనమైన నాలుగు కొత్త గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రతి గ్రామానికి రూ. 25లక్షల చొప్పున రూ. 1 కోటి నిధులకు ఆమోదం తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... తమ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నియోజకవర్గ పరిధిలోని ౪మున్సిపాలిటీలలో రూ.114 కోట్లు, అందులో భాగంగానే పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ అభివృద్ది కోసం రూ. 29 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలోని మౌలిక సదుపాయాలపై, మహిళల ఇచ్చే రూ. 12వేల పలు అంశాలపై చర్చిచండం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పండుగుల జయశ్రీ రాజు, వైస్ చైర్‌పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమీషనర్ ఎస్ రవీందర్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.