calender_icon.png 28 November, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

28-11-2024 12:50:45 AM

మంత్రి పొంగులేటి హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 27 (విజయక్రాంతి): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు శాఖల అధికారుల పనితీరుపై  ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయన్నారు.

అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. సీఎస్‌ఆర్ నిధులు నిర్వీర్యం కాకుండా సీపీవో బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. పంచాయతీ కార్యాదర్శులపై డీపీవో, తహసీల్దార్, ఆర్డీవోల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను అదనపు కలెక్టర్ సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. రోడ్ల అభివృద్ధి పనులకు అటవీ శాఖ నుంచి అనుమతులను పొంది పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు నివాసం ఒకచోట, విధులు మరో చోట నిర్వహిస్తుండటంతో ఆయా గ్రామాలపై వారికి పట్టు ఉండటం లేదని, పనిచేసే గ్రామాల్లోనే నివాసం ఉండాలని ఆదేశించారు.

తహసీల్దార్లను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆర్డీవోలపై ఉందన్నారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. మున్సిపాల్టీల్లో జరిగే అభివృద్ధి పనుల్లో మెరుగైన పనితీరు కోసం ఒక్కరికే రూ.50 లక్షలు, ఆపైనే టెండర్లు ఇవ్వాలని మంత్రి పొంగులేటి సూచించారు.

కూసుమంచి మండలంలో పర్యటన

ఖమ్మం, నవంబర్ 27 (విజయక్రాంతి)/కూసుమంచి: కూసుమంచి మండలంలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. చేగొమ్మ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షే మానికి కృషి చేస్తున్నదన్నారు.