calender_icon.png 31 October, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పనిసరైతేనే నీట్ రీటెస్ట్

19-07-2024 12:05:00 AM

  1. పరీక్ష పవిత్రతకు నష్టం జరిగితేనే ఆదేశించగలం
  2. నీట్‌పై విచారణపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
  3. పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలు వెల్లడించాని ఆదేశం

న్యూఢిల్లీ, జూలై 18: విస్తృత స్థాయిలో పరీక్షలో అవకతవకలు జరిగినట్లు రుజువైతేనే నీట్ పునఃపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పరీక్ష పవిత్రత పూర్తిగా దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని మరోసారి అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలు, నగరాల వారీగా ఫలితాలు వెల్లడించాలని ఎన్టీయేకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సొలిసిటర్ జనరల్ తెలిపిన ప్రకారం 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్ కోరుతున్నారు. నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు తాము సామాజిక పరిణామాలనే పరిగణనలోకి తీసుకుంటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు, ఎన్టీయే నుంచి మరింత సమాచారాన్ని సీజేఐ అడిగారు. మొత్తం మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యారులు పొందిన మార్కులెన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారని ప్రశ్నించారు. కాగా, నీట్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ కాగా తాజాగా పాట్నా ఎయిమ్స్‌కు చెందిన నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులను సీబీఐ అరెస్ట్ చేసింది. వారి హాస్టల్ గదుల్ని సీజ్ చేశారు.  

లక్ష మందికే..

పరీక్ష రాసిన 24 లక్షల మందిలో లక్షా 8 వేల మందికి మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగితేనే రీటెస్ట్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపడితే విచారణపై ప్రభావం పడుతుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే దీనిపై స్పందిస్తామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.  

సెంటర్లవారీగా ఫలితాలు

నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో పరీక్షా కేంద్రం, నగరాల వారీగా ఫలితాలు ప్రకటించాలని ఎన్టీయేను సుప్రీంకోర్టు ఆదే శించింది. ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. నీట్ సంబంధించిన పిటిషన్లను జూలై 22న తిరిగి విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలు వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివ రాలను కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. నీట్ లీకేజీ విషయం లో పేపర్ లీకేజీ బీహార్‌లోని పాట్నా హజారీబాగ్‌కే పరిమితమైనట్లు కనిపిస్తోందని ధర్మాసనం గుర్తించింది. ఈ నేప థ్యంలోనే పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించాలని ఆదేశించింది.