06-07-2024 12:45:58 AM
న్యూఢిల్లీ, జూలై 5 : దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నీట్-యూజీ పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తన వైఖరి తెలిపింది. తాము నీట్ రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని భావించడం లేదని స్పష్టం చేసింది. నీట్ యూజీ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాలు లేవని.. అలాంటప్పుడు మొత్తం పరీక్షను రద్దు చేయడం సబబు కాదని కోర్టుకు వివరించింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
నీట్ ర్యాంకర్ల పిటిషన్
నీట్ పరీక్షను రద్దు చేయొద్దని కోరుతూ గురువారం 56 మంది నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కూడా జూలై 8న ధర్మాసనం విచారణ జరపనుంది. వాయిదా పడిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నారు.