సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం
నీట్ పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని వెల్లడి
విచారణ ఈనెల 18కి వాయిదా
న్యూఢిల్లీ, జూలై 12 : నీట్ పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని, వచ్చే వారంలో కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టులో నీట్ పేపర్ లీకేజీపై జరగాల్సిన విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దాఖలు చేసిన అఫిడవిట్ ఇంకా కొన్ని పక్షాలకు అందలేదని, అందుకే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే, పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. విచారణ పురోగతికి సంబంధించిన నివేదికను తమకు సమర్పించినట్లు తెలిపింది.